Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి మాటలు మూసీ కంటే కంపుగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సభలో ఉన్న సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని ఆయన తెలిపారు. సభ్యుల హక్కులను కాపాడాల్సింది స్పీకరేనని స్పష్టం చేశారు.
ఏడు రోజులు సభ నడుపుతామని బీఏసీలో చర్చించామని హరీశ్‌రావు తెలిపారు. కానీ బీఏసీ కాపీలో 7 రోజులు అని ఎక్కడా లేదని పేర్కొన్నారు. సభ ఎజెండా వివరాలు అర్ధరాత్రి 2 గంటలకు వస్తే.. సభ్యులు ఎలా ప్రిపేర్ అవుతారని ఆయన ప్రశ్నించారు.
కాగా, రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూసీ సుందరీకరణ అంశంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం వ్యాఖ్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. కానీ అందుకు స్పీకర్ నిరాకరించడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.