MTV | ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంగీత ప్రియులను నాలుగు దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ మ్యూజిక్ ఛానెల్ MTV తన 24 గంటల సంగీత ప్రసారాలకు శాశ్వతంగా ముగింపు పలికింది. పారామౌంట్ గ్లోబల్ యాజమాన్యంలో ఉన్న MTV, డిసెంబర్ 31 నాటికి తన నిరంతర మ్యూజిక్ టెలికాస్ట్‌ను పూర్తిగా నిలిపివేసింది. దీంతో మ్యూజిక్ టెలివిజన్ చరిత్రలో ఒక స్వర్ణాధ్యాయం ముగిసినట్టైంది. న్యూ ఇయర్ ఈవ్ రోజున ప్రసారమైన చివరి షో అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. 1981 ఆగస్టు 1న MTV ప్రారంభ సమయంలో తొలి మ్యూజిక్ వీడియోగా ప్రసారం చేసిన ది బగుల్స్ బృందం పాడిన “Video Killed the Radio Star” పాటనే, చివరి వీడియోగా ప్రసారం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
MTV ఇప్పటికే 2025 నుంచి 24/7 మ్యూజిక్ ఛానెల్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దానికి అనుగుణంగా యునైటెడ్ కింగ్డమ్లో MTV Music, MTV 80s, MTV 90s, Club MTV, MTV Live వంటి ప్రసిద్ధ ఛానెల్స్ పూర్తిగా ఆఫ్ఎయిర్ అయ్యాయి.ప్రత్యేకంగా MTV 90s చివరి ప్రసారంలో స్పైస్ గర్ల్స్ పాడిన “Goodbye” పాటను ప్రసారం చేయడం సంగీతాభిమానులకు మరింత భావోద్వేగ క్షణంగా మారింది. ప్రస్తుతం ఈ ఛానెల్స్‌లో కేవలం MTV లోగోలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. MTV కంటెంట్‌ను ఇకపై MTV HD ద్వారా మాత్రమే చూడవచ్చని సమాచారం.
అమెరికాలో MTV మ్యూజిక్ ఛానెల్స్ భవిష్యత్తుపై మాత్రం ఇప్పటివరకు MTV గానీ, మాతృసంస్థ పారామౌంట్ లేదా స్కైడాన్స్ గానీ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే పారామౌంట్ సీఈఓ డేవిడ్ ఎలిసన్ మాట్లాడుతూ, MTVతో పాటు ఇతర కేబుల్ ఛానెల్స్‌ను పునరుజ్జీవింపజేసే దిశగా ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. 1981లో అమెరికాలో ప్రారంభమైన MTV, 1987లో యునైటెడ్ కింగ్డమ్ మరియు ఐర్లాండ్లలోకి ప్రవేశించింది. ప్రారంభంలో పూర్తిగా సంగీత వీడియోలకే పరిమితమైన MTV, కాలక్రమేణా రియాలిటీ షోలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌ల వైపు మళ్లింది. ఈ మార్పులు కూడా మ్యూజిక్ ఛానెల్స్ మూతపడటానికి ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. యూకేతో పాటు ఆస్ట్రేలియా, పోలాండ్, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా ప్రత్యేక మ్యూజిక్ MTV ఛానెల్స్‌ను మూసివేయనున్నట్లు సమాచారం. అలాగే వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా MTV యూరప్ మ్యూజిక్ అవార్డ్స్, MTV లాటిన్ అమెరికా MIAW అవార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను కూడా రద్దు చేశారు.