జడ్చర్లటౌన్, సెప్టెంబర్14 : మద్యానికి బానిసై తాగిన మైకంలో కన్నతల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించిన కుమారుడిని కన్న తండ్రి కొట్టి చంపిన ఘటన ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. జడ్చర్ల పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన పాలమూరు నాగయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
గత కొన్ని ఏండ్లుగా నాగయ్య, లక్ష్మి దంపతులు తన చిన్న కుమారుడు శ్రీధర్యాదవ్(28)తో కలిసి జడ్చర్లలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో నివాసముంటున్నారు. శ్రీధర్యాదవ్ తాగుడుకి బాని సై జాల్సాలు చేస్తూ తల్లిదండ్రులను వేధిస్తుండేవాడు. తాగిన మైకంలో తల్లిపైనే లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి శ్రీధర్ తాగొచ్చి మత్తులో తల్లిపై అఘాయిత్యానికి యత్నించాడు. దీంతో తల్లి కేకలు వేయ గా పక్క గదిలో ఉన్న తండ్రి నాగయ్య అక్కడొచ్చి కుమారుడిని పక్కకు నెట్టేవేసేయత్నంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది.
ఈ క్రమంలో తండ్రి నాగయ్య కట్టెతో కుమారుడు శ్రీధర్ తలపై దాడి చేయగా అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న జడ్చర్ల సీఐ కమలాకర్ ఆదివారం ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల మార్చురీకి తరలించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల సీఐ తెలిపారు.