కాంగ్రెస్ పార్టీ తీరును చూసి ఒక్కోసారి నమ్మశక్యం కాని ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ప్రస్తుత 23 శాతం నుంచి 42 శాతానికి పెంచగలమనే హామీని ఇవ్వాలనే ఆలోచన ఆ పార్టీలోని ఏ మేధావికి కలిగినట్టు? అవి పార్టీ మేనిఫెస్టోలోని ఆర్థిక, పరిపాలనాపరమైన హామీల వంటిది కాదు. చట్టాన్ని మార్చితే తప్ప అమలు కాదు. అట్లా చట్టాన్ని కేంద్రం తప్ప రాష్ట్రం మార్చలేదు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా కేంద్రం సైతం మార్చటం సాధ్యం కాదు. లోగడ కొన్ని రాష్ర్టాలు ప్రయత్నించగా కోర్టులలో నిలవలేదు.
ఈ విషయాలన్నీ ఇప్పుడు కొత్తగా కనుగొని రాస్తున్నవి కాదు. కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలకు తెలుసు. ప్రభుత్వాధికారులకు తెలుసు. న్యాయవాదులకు తెలుసు. బీసీ నాయకులకు కూడా తెలుసు. అయినప్పటికీ ఆ మాటను కామారెడ్డి డిక్లరేషన్‌లో ఎందుకు చేర్చినట్టు? విషయాలు తెలిసినవారు వలదని వారించినా ఆ పని ఎందుకు చేసినట్టు? అటువంటి సూచన చేసిన మేధావి, లేదా మేధావులు ఎవరై ఉంటారు? వారికి పరిస్థితి తెలియదని భావించలేం. విడిగా కామారెడ్డి డిక్లరేషన్ రచయితలు ఎవరో తెలియదు గాని, మేనిఫెస్టో కమిటీ పేర్లు మాత్రం అందులోని మూడవ కవర్ పేజీలో ఉన్నాయి. కమిటీ అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. ఆయన ఉన్నత విద్యావంతుడే గాక ఢిల్లీ యూనివర్సిటీ నుంచి, బీఏ ఎల్ఎల్బీ చేశారు. కొంతకాలం హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. అందువల్ల, రిజర్వేషన్ల హెచ్చింపుతో సంబంధం గల చట్టపరమైన కోణాలు ఆయనకు తప్పక తెలిసి ఉండాలి. తను గాక కమిటీకి ఒక ఉపాధ్యక్షుడు, 20 మంది సభ్యులు ఉన్నారు. అందరూ ప్రముఖులే. వారిలో కొందరు బడుగువర్గాల వారు. కామారెడ్డి డిక్లరేషన్ తయారుచేసినవారి పేర్లు కూడా తెలిస్తే బాగుండేది. తెలియదు గనుక వదిలివేద్దాం.
మొత్తం మీద ఈ విధంగా బీసీలకు బుద్ధిపూర్వకంగా వలపన్నటమనే పని దశలు దశలుగా జరుగుతూ వచ్చిందన్నది స్పష్టం. మొదటిది, ఈ ఆలోచన ఒరిజినల్‌గా హైదరాబాద్‌లోనో, ఢిల్లీలోనో ఎవరికి వచ్చిందన్నది. రెండు, సదరు ఆలోచనను హైదరాబాద్‌లో, ఢిల్లీలో ఒరిజినల్‌గా ఆమోదించిన బాధ్యులు ఎవరన్నది. మూడు, ఆ మాటను కామారెడ్డి డిక్లరేషన్‌లో చేర్చటానికి ముందు చర్చించి, ఆమోదించినవారు ఎవరన్నది. నాలుగు, వివిధ డిక్లరేషన్లు అన్నీ కలిపి అంతిమంగా ‘అభయహస్తం మేనిఫెస్టో’ను ప్రకటించినప్పుడు మేనిఫెస్టో కమిటీ బీసీ రిజర్వేషన్ల హెచ్చింపు సాధ్యాసాధ్యాల గురించి చర్చించిందా? చర్చిస్తే ముఖ్యంగా చట్టపరమైన సాధ్యాసాధ్యాలు చర్చకు వచ్చాయా? చర్చించి ఉంటే ఏమి భావించారన్నది. ఇప్పుడు రాష్ట్ర హైకోర్టులో ఎదురైన పరిస్థితి దృష్ట్యా ఎవరైనా జర్నలిస్టులు కామారెడ్డి డిక్లరేషన్ తయారీదారులను, మేనిఫెస్టో కమిటీ పెద్దలను, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకులను, కేంద్ర అధినాయకులను ఆయా విషయాలపై ఇంటర్వ్యూలు చేయగలిగితే బీసీలకు, ప్రజలకు చాలా తెలుస్తాయి.
దీనిగురించి ఇంత చర్చించి ఇన్ని ప్రశ్నలు లేవనెత్తటం ఎందుకంటే, ఓట్ల కోసం ఇటువంటి అసాధ్యపు హామీని తెలిసి కూడా ఇవ్వటం ఒక పథకం వంటిది. ఒక ఆపరేషన్ వంటిది. నేర్పుగా, ఓర్పుగా ఒక వల పన్నటం వంటిది. కనుక, సదరు ఆపరేషన్ మొదటినుంచి చివరి వరకు ఏ విధంగా సాగిందనే విషయం ప్రజలకు వెల్లడి కావాలి. ఇది ఒకఆశను హత్య చేయటంపై అపరాధ పరిశోధన వంటిది.
మేనిఫెస్టోలో సాధారణంగా మూడు విధాలైన హామీలుంటాయి. ఆర్థికపరమైనవి, పరిపాలనా సంబంధమైనవి, చట్టాలతో నిమిత్తం గలవి. హామీలు అన్నీ అమలవుతాయని ప్రజలేమీ భావించరు. తమ అనుభవంలో అనేక పార్టీల అనేక హామీలను చూశారు గనుక. హెచ్చుతగ్గులు ఎ ప్పుడూ ఉంటాయి. కానీ కొన్ని హామీలు ముఖ్యంగా మారి ప్రజల మనసుకు ఎక్కుతాయి. అదిగాక, మేనిఫెస్టోలను, హామీలను వారు ఒకప్పటి వలె గాక, తమకు చైతన్యాలు పెరిగిన కొద్దీ, జీవితావసరాలు పెరిగిన కొద్దీ ఎక్కువగా పట్టించుకుంటున్నారు. అది వారి ఓటింగ్ సరళిపై ప్రభావం చూపుతున్నది.
ఇదంతా విషయానికి సాధారణ కోణం కాగా, ఆర్థికపరమైన, పరిపాలనాపరమైన హామీల అమలులో వైఫల్యం కన్న, రిజర్వేషన్లు పెంచటంలోని వైఫల్యం అనేక రెట్లు ప్రభావం చూపుతుంది. ఎందుకంటే, మొదటి రెండు అమలుకావటం లేదా కాకపోవటం వల్ల ఓటర్లకు వ్యక్తిగతంగానో, చిన్న సమూహాలకో, ఒక కాలపరిమితితో లాభాలు, నష్టాలు జరుగుతాయి. బీసీ రిజర్వేషన్ల అంశం అందుకు చాలా భిన్నమైనది. అది, రాష్ట్ర ప్రభుత్వ సర్వే చెప్తున్న లెక్కల ప్రకారమే సగానికి పైగా జనాభాకు సంబంధించినది. అనేకానేక వెనుకబడిన కులాలతో నిమిత్తం గలది. ఒకసారి ఈ పని జరిగితే చిన్నపాటి బీసీ కులాలలో కొత్త స్పృహలు కలిగి, కొత్త డిమాండ్లు వచ్చి, వారికి కూడా అవకాశాలు లభించగలవని ఆ వర్గాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నవి. ఒకసారి రాజకీయ రిజర్వేషన్ల హెచ్చింపుతో మొదలైతే ఇతర రంగాలకు విస్తరించగలదని ఆశిస్తున్నది. అంతవరకెందుకు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన కామారెడ్డి డిక్లరేషన్‌నే చూద్దాం. అది మూడు పేజీలలో విస్తరించి ఉంది. అందులో 11 భాగాలున్నాయి. రిజర్వేషన్లనే గాక నిధులు, సంక్షేమం, విద్య, చేతివృత్తులను పేర్కొన్నారు. అదిగాక ‘వివిధ సామాజికవర్గాలకు హామీలు’ పేరుతో 8 ముఖ్యమైన కులాలను , 5 ఉప కులాలను ప్రస్తావించారు. వారందరికి కలిపి 17 హామీలున్నాయి. అనగా ఈ అంశం చాలా విస్తృతమైనది. భవిష్యత్తుకంతా వర్తించి బీసీలకు అనేక విధాలుగా మేలు చేయగలది. సమాజపు నిచ్చెన మెట్లలో వారిని రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకుపోగలది.
కామారెడ్డి డిక్లరేషన్‌ను, మేనిఫెస్టోను ఇంత శ్రమతో, ఇంత విస్తారంగా రూపొందించారంటే, బీసీలపై కాంగ్రెస్ పార్టీ ఎంత దృష్టిపెట్టిందో అర్థమవుతుంది. మేనిఫెస్టోలో మొత్తం 5 డిక్లరేషన్లు ఉండగా, రైతులు, యూత్, ఎస్సీ-ఎస్టీలు, మైనారిటీ పేరిట గల నాలుగింటి కన్న బీసీ డిక్లరేషన్ పెద్దది కావటం విశేషం. ఎందుకట్లా అన్నది రహస్యం కాదు. వారి ఓట్ల బలం అంతటిది. వారు తమను గెలిపించగలరు, ఓడించగలరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండుసార్లు అధికారానికి రాలేకపోయిన తమను కనీసం మూడవసారైనా గెలిపించగల శక్తి వారి చేతిలో ఉంది. ఆ వర్గాలు విస్తారంగా ఉన్నా ఐక్యత లేదు. పట్టణ ప్రాంతాలలో కేంద్రీకృతమైన బీసీ నాయకులకు, విద్యావంతులకు తమ సొంత కోరికలు, ఆకాంక్షలు, లక్ష్యాలు మినహా గ్రామీణ ప్రాంతాలలో గల అసంఖ్యాక బీసీ జనం సమస్యలు పట్టవు. అయినప్పటికీ వారిని ఓటు బ్యాంకులుగా కదిలించి ఉపయోగించుకొనగలరు గనుక, మొత్తం మీద అంతిమ విశ్లేషణలో రిజర్వేషన్ల హెచ్చింపు అనే హామీ ఆ వర్గాలను బాగానే కదిలించగలదు. ఆర్థికపరమైన హామీలు, పరిపాలనాపరమైన హామీల కన్న, రాజకీయ భవిష్యత్తు, అభ్యున్నతి అనే అవకాశాలు ఎదురుగా కనిపించటం, ఎంతో కొంత మెరుగైన స్థితికి చేరిన బీసీలకు ఎక్కువ ఆకర్షణీయమవుతుంది.
జీవితంలో ఎదుగుదల (అప్వార్డ్ మొబిలిటీ) కోరుకునే తరగతికి సంబంధించిన సోషియాలజీ ఇది. దానికి అనుగుణంగానే సైకాలజీ ఉంటుంది. ఈ విషయాలను శాస్ర్తాలుగా అధ్యయనం చేసినా, చేయకపోయినా, ఎన్నికల రాజకీయాలలో అనుభవం గలవారు కామన్‌సెన్స్‌తో అయినా గ్రహించగల విషయమిది. అందువల్ల, ఎట్లా జరిగి ఉంటేనేమి మొత్తానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రిజర్వేషన్ల పెరుగుదల హామీ వచ్చిచేరింది.
గమనించదగినదేమంటే, చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచటమనే హామీ ఉంది. కానీ అధికారానికి వచ్చిన తర్వాత ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదించటం వంటి చర్యలేమీ తీసుకున్నట్టు లేరు. తమ జనాభా పెరిగినందున తమ రిజర్వేషన్లు కూడా పెంచాలని ఎస్టీలు కోరుతున్నా, ఎందువల్లనో ఆ ప్రస్తావన అసలు మేనిఫెస్టోలో లేదు.
కామారెడ్డి డిక్లరేషన్‌ను, మేనిఫెస్టోను ఇంత శ్రమతో, ఇంత విస్తారంగా రూపొందించారంటే, బీసీలపై కాంగ్రెస్ పార్టీ ఎంత దృష్టిపెట్టిందో అర్థమవుతుంది. మేనిఫెస్టోలో మొత్తం 5 డిక్లరేషన్లు ఉండగా, రైతులు, యూత్, ఎస్సీ-ఎస్టీలు, మైనారిటీ పేరిట గల నాలుగింటి కన్న బీసీ డిక్లరేషన్ పెద్దది కావటం విశేషం. ఎందుకట్లా అన్నది రహస్యం కాదు. వారి ఓట్ల బలం అంతటిది.
ఇప్పుడు మళ్లీ అసలు చర్చకు వస్తే, బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేయటం సాధ్యం కాదని తెలిసి కూడా డిక్లరేషన్‌లో, మేనిఫెస్టోలో చేర్చటం, అసెంబ్లీ తీర్మానాలు, రాష్ట్రస్థాయిలో బిల్లులు, గవర్నర్‌కు పంపటాలు, జీవోలు, ఎన్నికల నోటిఫికేషన్ల వంటివన్నీ ఒకవైపు, హైకోర్టులో జరిగిందేమిటన్నది మరొకవైపు కలిపి చూడగా అర్థమవుతున్నదేమిటి? ఓట్ల కోసం బీసీలకు వల అయితే బాగానే పన్నారు. కానీ, అది పనిచేసేది కాదని కనీసపు పరిజ్ఞానం గల వారికైనా తెలిసే విషయం వారికి తెలియకపోయింది. నిజానికి తెలియకపోవటమని కాదు, కానీ ఆ విధంగా మోసగించి అయినా అధికారంలోకి రావటం వారికి తప్పనిసరి అయింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దల వరకు. అంతగా దివాళాతీసి, పతనమై ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడింత పెద్ద సమస్యగా మారి వారి తలకు చుట్టుకుంటున్నది గాని, మొత్తం 40 పేజీల మేనిఫెస్టో అంతా ఏ విధంగా వైఫల్యాలమయంగా మారుతున్నదో ప్రజలు మాట్లాడుకుంటున్నదే. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి వివేకం కలిగితే, హైకోర్టు న్యాయమూర్తులు సూచించినట్టు ముందుకుపోవచ్చును. అంతకన్న గత్యంతరం కనిపించటం లేదు గనుక. అయితే అంతకుముందు, తాము వంచనాపూరితంగా వల పన్నినందుకు బీసీలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.
– టంకశాల అశోక్