‘గోదావరి నీళ్లను చూసేంతవరకు నిద్రాహారాలు మానేస్తా’ ఇది కేవలం రాజకీయ నినాదం కాదు; ఉమ్మడి నల్లగొండ జిల్లా కరువు కాటకంలో చిక్కుకున్న లక్షలాది ప్రజల పక్షాన మాజీ ఎంపీ భీంరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి) బలిదానానికి సిద్ధమై చేసిన దీక్ష. ఆయన గుండెల్లో నిప్పులా రగిలిన ఆ పోరాట జ్వాల, ఈరోజు రాజకీయ పన్నాగాల ముందు మసకబారుతుండటం చరిత్రకు సిగ్గుచేటు.
బి.ఎన్.రెడ్డి కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు; ఆయన ప్రజా జీవితంలో నిబద్ధతకు ఒక పాఠ్యపుస్తకం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలి ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా మొదలుపెట్టి, నాగారం ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మూడుసార్లు (మొత్తం 17 ఏండ్లు) మిర్యాలగూడ ఎంపీగా పనిచేసిన ఆయన ప్రస్థానం సేవకు, పోరాటానికి అంకితం చేయబడింది. తొలి దశ తెలంగాణ ఉద్యమ ప్రభంజనంలోనూ నిలిచి, గెలిచి తనదైన ముద్ర వేసుకున్నారు. తరిమెల నాగిరెడ్డి సభాపక్ష నాయకుడిగా రాజీనామా చేసిన వేళ ఆ పాత్రను భుజాన వేసుకొని ఆయన చేసిన కృషి.. నిజాయితీకి రాజీ లేదని నిరూపించింది. పదవులు తాత్కాలికమని, ప్రజా సమస్యల పరిష్కారాలు శాశ్వతమని నమ్మిన ఆయన.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) రెండో దశ ద్వారా 4.40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలనే లక్ష్యాన్ని తన జీవిత పరమావధిగా పెట్టుకున్నారు.
పోరాటానికి ప్రామాణికం: నీటి కోసం నెరపిన ప్రజాపోరాటాలు, రాసిన ప్రతిపాదనలు, పత్రాల్లో దాగిన వేదన గోదావరి జలాల సాధనలో ఆయన చేసిన పోరాటం కేవలం సభల్లో మాట్లాడిన మాటలు కాదు, అది అధికారిక పత్రాల్లో, లెక్కల్లో నిక్షిప్తమై ఉంది. ముఖ్యంగా అందులో ఒకదాన్ని పరిశీలిస్తే, 2001 మార్చి 15న నాటి కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడుకి రాసిన లేఖ ఆయన కృషికి తిరుగులేని ఆధారం. 1996లోనే పునాది వేసినా, పనులు మాత్రం 63వ కిలోమీటర్ వద్దే ఆగిపోయాయని, కేంద్ర జల కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఉన్నా, సాంకేతిక అంశాల సాకుతో కావాలనే అధికారులు ఆలస్యం చేస్తున్నారని ఈ లేఖలో ఆయన తన వేదనను వెళ్లగక్కారు. ‘గట్టిగా పట్టుబట్టి, దీనికి ఒక తుది రూపం ఇవ్వండి’ అంటూ కేంద్ర జోక్యాన్ని కోరిన ఆయన ఆర్తి, ఆ కరువు నేల పట్ల ఆయనకున్న అనుబంధానికి అద్దం పడుతుంది.
‘గోదావరి నీళ్లు చూసి తీరుతా’ అంటూ దృఢ సంకల్పాన్ని చాటారు. గోదావరి జలాలను ‘మా హక్కు’గా సాధించుకునేందుకు ప్రభుత్వంతో, అధికారులతో, అడ్డుపడిన ప్రతి రాజకీయ శక్తితో ఆయన తిరుగులేని పోరాటం చేశారు. ఇటువంటి పోరాటం, త్యాగం చేసిన యోధుడి పేరును పక్కన పెట్టడం చరిత్రకు, ప్రజాస్వామ్యానికి చేసే ద్రోహమే. చరిత్రను తుడిచేస్తున్న రాజకీయ పరాకాష్ఠ: బి.ఎన్.రెడ్డి నిస్వార్థ సేవ, అలసట లేని పోరాట ఫలితాలను అనుభవిస్తున్న నేటి పాలకులు… ఆ ఫలాన్ని అందించిన ప్రదాత పేరునే తుడిచిపెట్టాలని చూడటం అత్యంత శోచనీయం.
గోదావరి జలాలు రావాలంటే బీఎన్రెడ్డికే ఓటు వేయాలని గోడల మీద ఉన్న నినాదాలను చదివానని కేసీఆర్ తిరుమలగిరి సభలో ప్రస్తావించారు. ఈ ప్రాంతమంతా పోరాటాల గడ్డ, ఈ ప్రాంతానికి నీళ్లు రావాలని భీం రెడ్డి తపించారని కేసీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీరాంసాగర్ రెండో దశ నుంచి నల్లగొండకు కేసీఆర్ నీళ్లు వదిలిన ఘటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చరిత్ర తెలుసుకోకుండా, కేవలం కార్యకర్తల కరతాళ ధ్వనుల కోసం, అధికారిక పార్టీ మనుగడ కోసం ప్రకటనలు చేస్తూ, చరిత్రను వక్రీకరించడం తెలంగాణ ముఖ్యమంత్రికి తగదు. దశాబ్ద కాలం పాటు ఎమ్మెల్యేగా, పదిహేడేండ్ల పాటు ఎంపీగా ప్రజల కష్టాలు తీర్చేందుకు అంకితమైన ఒక త్యాగమూర్తికి ఇంతకుమించిన అన్యాయం, ఆయన అభిమానులకు అవమానభారం ఇంకొకటి ఉండబోదు.
న్యాయాన్ని నిలబెట్టండి: గోదావరి జలాల కోసం బి.ఎన్. రెడ్డి చేసిన పోరాటాన్ని, ఆయన గుండె కదలికను గౌరవించడం నేటి ప్రభుత్వ నైతిక బాధ్యత. ఈ నేలకు నీళ్లు అందించడానికి ఆయన చేసిన ప్రతి శ్వాస, ప్రతి అడుగూ నేడు మనకు రుణపడి ఉన్నాయి. ఆయన చూపిన మార్గాన్ని, ఆయన చేసిన కృషిని గౌరవించాలంటే… గోదావరి జలాల సాధనకు అసలు కారకులైన, నిజమైన ప్రదాత అయిన భీంరెడ్డి నరసింహారెడ్డి పేరు మాత్రమే దీనికి సరైనది. చరిత్రను వక్రీకరించే ఎలాంటి అనైతిక ప్రకటనైనా తక్షణమే ఉపసంహరించుకోవాలి. సుదీర్ఘ కాలం పార్లమెంట్ సభ్యుడైన ఆ మహనీయుడి నిజమైన చరిత్రను గౌరవించి, న్యాయాన్ని నిలబెట్టాలని కోరుకుందాం. నీళ్ల కోసం నిప్పులా పోరాడిన మహనీయుడు బి.ఎన్. రెడ్డి ఆత్మకు శాంతి కలిగించాల్సిన, గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ సమాజంపైనే ఉన్నది. ఈ పాలకులు జీవోల ద్వారా పేరు కబ్జా పెట్టాలని చూస్తున్నారు కానీ, కేసీఆర్ నీళ్లు పారించిన రోజే తుంగతుర్తి రైతాంగం ఎస్సారెస్పీ కాలువకు బీఎన్‌రెడ్డి పేరును బోర్డుపై రాసి పెట్టారు.
– మల్లు కపోతం రెడ్డి 95152 25502