అటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్ రెండేండ్లుగా కొనసాగిస్తున్న గాజా యుద్ధానికి తెరపడుతున్న సమయంలోనే ఇటు దక్షిణాసియాలో పాక్-ఆఫ్ఘన్ దేశాల మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి. రెండు దేశాల ఆవేశపూరిత ప్రకటనలను గమనిస్తుంటే ఆ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమిస్తాయా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత వారాంతంలో రెండుదేశాల సరిహద్దు అయిన ‘డ్యూరాండ్ లైన్’పై ఒకరి ఆర్మీ పోస్టులపై మరొకరు దాడులకు దిగినట్టు వార్తలు వెలువడ్డాయి.
ఈ ఘర్షణలకు తెహరికే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) అనే ఉగ్రవాద సంస్థ కేంద్రబిందువుగా ఉన్నది. ఈ సంస్థకు ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తున్నట్టు పాకిస్థాన్ ఆరోపిస్తున్నది. ఈ నెపం మీద ఇటీవల ఆఫ్ఘన్ భూభాగంపై దాడులు ఉధృతం చేసింది. అయితే ఆ సంస్థకు తాము ఎలాంటి ఆశ్రయం కల్పించడం లేదని, అది పూర్తిగా పాక్ అంతర్గత వ్యవహారమని తాలిబన్లు అంటున్నారు. పాక్ హద్దు మీరుతున్నదని ఆరోపిస్తూ తాలిబన్లు ఎదురుదాడికి దిగడంతో పరిస్థితి విషమించింది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘర్షణలు చోటుచేసుకోవడం గమనార్హం.
2021లో అమెరికా సేనలు ఆఫ్ఘన్ నుంచి వైదొలగిన వెంటనే ప్రభుత్వంపై తాలిబన్లు పట్టు బిగించారు. ఒకప్పుడు సోవియట్ సైన్యాన్ని పారదోలేందుకు పాక్ అండతో అమెరికా సృష్టించిన తాలిబన్లు క్రమంగా ఆ రెండు దేశాలకు దూరమైపోయారు. దక్షిణాసియాలో భారత్‌కు మిగిలిన ఏకైక సానుకూల మిత్రదేశంగా ఆఫ్ఘనిస్థాన్ మారడం తెలిసిందే. కొంతవరకు చైనాకూ దగ్గరయ్యారు. ప్రస్తుతం చైనాను ప్రధాన లక్ష్యంగా, భారత్‌ను పరోక్ష లక్ష్యంగా చేసుకున్న అమెరికాకు ఇది మింగుడు పడటం లేదు. ఇటీవలే ఇరాన్‌పై అమెరికా యుద్ధ విమానాలు దాడిచేసి అక్కడ అణుస్థావరాలను ధ్వంసం చేసింది.
ఇరాన్‌కు ఆఫ్ఘన్ పొరుగు దేశమనేది తెలిసిందే. ఇలా అన్నిరకాలుగా కీలక ప్రాంతంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ తమ ప్రభావ పరిధికి వెలుపల ఉండిపోవడం అమెరికాకు గిట్టడం లేదు. పైగా నాలుగేండ్ల క్రితం హడావుడిగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా వైదొలగినప్పుడు అక్కడి ప్రభుత్వంతోపాటు బగ్రామ్ ఎయిర్ బేస్ కూడా తాలిబన్ల వశమైంది. మారిన వ్యూహాత్మక పరిస్థితుల్లో ఈ ఎయిర్‌బేస్‌పై అమెరికా కన్నుపడింది. దానిని తమకు తిరిగి అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే డిమాండ్ చేస్తుండటం తెలిసిందే.
సుదీర్ఘకాలంగా అమెరికా తాబేదారుగా వ్యవహరిస్తున్న పాక్ ఇప్పుడు ఆఫ్ఘన్ భూభాగంపై, విశేషించి రాజధాని కాబూల్ దాకా దాడులు చేస్తుండటాన్ని ఈ కోణంలో చూడాలి. అటు ఆఫ్ఘనిస్థాన్‌లో పాక్ వ్యతిరేకత రోజురోజుకూ రాజుకుంటున్నది. అగ్రరాజ్యాల చేతుల్లో పావుగా ఎంతో నష్టపోయిన అనుభవం వారికుంది. స్వతంత్ర విదేశాంగ విధానం వైపు అడుగులు వేయాలన్న ఆకాంక్ష వ్యక్తమవుతున్నది. భారత్‌తో సత్సంబంధాలకు కృషి చేయడం వెనుక గల కారణం ఇదే. ఆఫ్ఘన్ ప్రజల మనసు చూరగొనేందుకు పాక్‌పై ప్రతీకార దాడి జరపడం తాలిబన్లకు ఓ రాజకీయ అవసరంగానూ ముందుకు వచ్చింది. ఆఫ్ఘన్-పాక్ ఘర్షణలను ఈ నేపథ్యంలో నుంచి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.