సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): నగర శివారులో దొంగలు హల్చల్ చేస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు..కాలేజీలు, గేటెడ్ కమ్యూనిటీలను కూడా వదలకుండా వరుస చోరీలు జరుగుతున్నాయి..ఒక కేసును ఛేదించకముందే.. మరో చోరీ ఘటనకు పాల్పడుతూ దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వరుస దొంగతనాలు చేస్తుంది.. పాత నేరస్తుల ముఠానా? కొత్త ముఠాలా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గత శుక్రవారం అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలోని బ్రిలియంట్ విద్యా సంస్థలకు చెందిన రూ. 1.07 కోట్లు దొంగలు అపహరించారు.
ఈ ఘటన తెలిసిన వారి పనా? ఏపీ పోలీసుల నుంచి పరారైన బత్తుల ప్రభాకర్ పనా? కొత్త ముఠాలా పనా? అనే విషయాలపై పోలీసులు విశ్లేషిస్తున్నారు. కాలేజీకి సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఈజీగా దొంగలు కాలేజీలో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న ప్రభాకర్ చేసిన దొంగతనాల మాదిరిగానే మరో ముఠా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో ఇలాంటి దొంగతనాల గూర్చి వివరాలు సేకరించిన పోలీసులు కొన్ని ముఠాలను గుర్తించినట్లు సమాచారం. అనుమానితులను అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసు ఛేదించడంలో పోలీసులు మూడు రోజులైనా సరైన ఫలితాన్ని రాబట్టకముందే, పక్క పోలీస్‌స్టేషన్ పరిధి అయిన హయత్‌నగర్ ఠాణా పరిధిలోని అంబర్పేట్ ప్రాంతంలో గేటెడ్ కమ్యూనిటీలో వరుస దొంగతనాలు జరగడం ఆందోళన కల్గిస్తోంది. ఆదివారం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముసుగు దొంగలు స్వైర విహారం చేశారు.