Health | కొంతమంది ఎక్కువసేపు మూత్రాన్ని పట్టి ఉంచుకోలేరు. తగినన్ని నీళ్లు తాగేవాళ్లు రోజుకు ఏడెనిమిది సార్లు టాయిలెట్‌కు వెళ్లడం సహజం. ఒకసారి మూత్ర విసర్జనకు వెళ్లడం కూడా రాత్రి నిద్రలో భాగమే. ఇది పరిమితి దాటితే.. ఆ పరిస్థితిని ఓవర్ యాక్టివ్ బ్లాడర్ డిసీజ్ (ఓఏబీ) అని పిలుస్తారు. ఈ సమస్య ఏ వయసులోనైనా తలెత్తే ఆస్కారం ఉంది. ఓఏబీ విషయంలో ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే, మనం తీసుకునే కొన్నిరకాల పదార్థాలు మూత్రాశయం మీద ఒత్తిడి కలిగిస్తాయి. ఓఏబీని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన, తీసుకోకూడని ఆహార పదార్థాల జాబితా ఇది..
వీటిలోని కెఫీన్ తరచుగా మూత్రానికి వెళ్లడానికి కారణం అవుతుంది. చాక్లెట్లు అతిగా తింటే మూత్రాశయంలోని సున్నితమైన కండరాలపై నేరుగా ప్రభావం పడుతుంది. డార్క్ చాక్లెట్‌కు బదులుగా, కెఫీన్ అసలే లేని వైట్ చాక్లెట్ తీసుకోవడం ఉత్తమం.
టీ, కాఫీల్లోనూ కెఫీన్ పరిమాణం ఎక్కువే. పరిమితికి మించి తాగినప్పుడు ఇది మూత్రాశయాన్ని చురుగ్గా చేస్తుంది. దీంతో ఎక్కువసార్లు వెళ్లాల్సిరావచ్చు. సాధ్య మైనంత వరకూ కెఫీన్ లేని పానీయాలు ఎంచుకుంటే మంచిది.
నారింజ, బత్తాయి, నిమ్మ లాంటి సిట్రస్ జాతి పండ్లు మూత్రాశయాన్ని చురుగ్గా చేస్తాయి. వీటిలో ఉండే సిట్రిక్ ఆమ్లం మూత్రాశయం నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. వీటికి తోడు మూత్రనాళంలో మంటకు కారణమయ్యే అంగూర్, క్రాన్బెర్రీలను ఎక్కువగా తీసుకోక పోవడమే మంచిది.
టమాటాలో ఎసిటిక్ ఆమ్లం ఎక్కువ. ఇది మూత్రాశయంలో మంట కలిగించి, ఓఏబీ లక్షణాలను తీవ్రం చేస్తుంది. కాబట్టి, ఓఏబీ తీవ్రంగా బాధిస్తున్నవారు టమాటా ఎక్కువగా ఉపయోగించే పాస్తా, పిజ్జా, సాస్, కెచప్, సల్సాలకు దూరం ఉండటం మంచిది. పచ్చి ఉల్లిపాయలు కూడా మూత్రాశయ సమస్యలను ఎక్కువ చేస్తాయి. ఉడికించి తింటే సమస్య తీవ్రత కొంతమేర తగ్గుతుందనే సంగతి మరిచిపోకూడదు.
సోడా, ఎనర్జీ డ్రింక్స్‌లాంటి ఏ కార్బొనేటెడ్ పానీయమైనా ఓఏబీ లక్షణాలను ఎక్కువ చేస్తుంది. వీటిని దూరం పెడితే ఆరోగ్యానికి మేలు. ఆల్కహాల్ కూడా మంచిది కాదు. హాయిగా కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ తాగొచ్చు.
సహజ, కృత్రిమ స్వీట్నర్స్, మసాలాలు, మసాలాలు దట్టించిన సలాడ్స్, చిప్స్, ఉప్పు పట్టించిన గింజలు, ఇతర ఆహారాలు కూడా ఓఏబీ లక్షణాలను పెంచుతాయి. దీంతో ఎప్పుడూ దాహంగా అనిపిస్తుంది. కాబట్టి యాస్పర్టేమ్, శాక్రిన్ లాంటి స్వీట్నర్లను మన ఆహారం నుంచి పూర్తిగా తొలగించుకోవాలి. మసాలాలను మితంగా వాడాలి. ఉప్పు తక్కువగా ఉన్న చిరుతిళ్లు ఎంచుకోవాలి.
అరటిపండ్లు.. పొటాషియం, ఫైబర్ గనులు. వీటిని నిరభ్యంతరంగా తినొచ్చు. కాజూ, బాదం, పల్లీలు ఆహారంలో చేర్చుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్-కె ఎక్కువగా ఉండే దోస కూడా ఓఏబీ బాధితులకు మంచి ఎంపికే. కాకపోతే, ఇవన్నీ సమస్యను తగ్గిస్తాయే కానీ, పూర్తిగా నయం చేయలేవనే విషయం గుర్తుపెట్టుకోవాలి. తీవ్రతను బట్టి డాక్టర్లను కలిసి చికిత్స చేయించుకోవాలి.