వికారాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఎస్ఐఆర్(ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ఫారాల భర్తీపై ఓటర్లలో గందరగోళం నెలకొన్నది. సర్ ఫారాల భర్తీపై బీఎల్వోలకు సరైన అవగాహన లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. బీఎల్వోలు ఓటర్లకు ఇచ్చే సర్ ఫారాల భర్తీకి సంబంధించి కుడివైపు ఏ వివరాలను రాయాలి, ఎడమ వైపు ఏయే వివరాలను భర్తీ చేయాలనే దానిపై మెజార్టీ బీఎల్వోలకు అవగాహన లేకపోవడంతో ఓటర్లలో గందరగోళం సృష్టిస్తున్నారు.
కొందరు బీఎల్వోలు కుడివైపు 2002 ఓటరు జాబితాలో ఉన్న ఓటర్ల కుటుంబ సభ్యుల వివరాలను భర్తీ చేయాలని, మరికొందరు బీఎల్వోలు 2002 ఓటరు జాబితాలో ఓటరు పేరు ఉన్నట్లయితే సదరు ఓటరు వివరాలను భర్తీ చేయాలని, మరికొందరు బీఎల్వోలు 2002 ఓటరు జాబితాలో కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నట్లయితే ఎడమవైపు భర్తీ చేయాలని సూచిస్తుండటంతో మెజార్టీ ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొన్నది.
ఎస్ఐఆర్ ఫారంలో వివరాలను తప్పుగా భర్తీ చేస్తే తమ ఓటు గల్లంతయ్యే ప్రమాదముందనే ఆందోళనతో చాలా మంది ఓటర్లు ఎస్ఐఆర్ ఫారాలను తీసుకున్నారు తప్ప ఇప్పటివరకు వివరాలను రాయకపోవడం గమనార్హం. మరోవైపు 2002 ఓటరు జాబితాలో ఓటరు కుటుంబ సభ్యుల పేర్లు, ఓటరు పేరు లేనట్లయితే ఓటు గల్లంతవుతుందా అంటూ ఓటర్లలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై టెన్షన్ నెలకొన్నది. బీఎల్వోలకు సర్ ఫారాల భర్తీపై మరోసారి శిక్షణనివ్వాలని, వారికి సరైన అవగాహన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తప్పుగా సూచనలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఓటర్లు పేర్కొంటున్నారు.
ఫారాల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
బీఎల్వోల వద్ద ఉండాల్సిన సర్ ఫారాలు కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకుల వద్ద ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంటింటికీ వెళ్లి బీఎల్వోలు అందజేయాల్సిన సర్ ఫారాలను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తుండటంపై బీఆర్ఎస్ నాయకులు తప్పుబడుతున్నారు. తాండూరు మండలం రాంపూర్‌లో బీఎల్వోలు లేకుండానే సర్ ఫారాలను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేయడంపై బీఎల్వోలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ నాయకులకు ఎస్ఐఆర్ ఫారాలను అందజేస్తే, బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీలకు చెందిన వారి ఫారాలను ఉద్దేశపూర్వకంగా ఇవ్వనట్లయితే వారి ఓట్లు గల్లంతయ్యే ప్రమాదముందని, బీఎల్వోలు మాత్రమే ఫారాలను పంపిణీ చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు. మరోవైపు వికారాబాద్ మున్సిపాలిటీలో ఎస్ఐఆర్ ఫారాల పంపిణీ నత్తనడకన సాగుతున్నది. 179 పోలింగ్ బూత్‌లో ఇప్పటివరకు సగం ఫారాలను కూడా పంపిణీ చేయకపోవడం గమనార్హం.
మరో పోలింగ్ బూత్‌లో అయితే మరీ గందరగోళ పరిస్థితి ఉన్నది. కొత్తగా వచ్చిన అంగన్వాడీ టీచర్‌కు బీఎల్వో బాధ్యతలు అప్పగించడంతో సదరు బీఎల్వోకు అడ్రస్‌లు ఏమీ తెలియకపోవడంతో సర్ ఫారాలను కనీసం 10 శాతం కూడా పంపిణీ చేయకుండా అంగన్వాడీ కేంద్రంలోనే పెట్టింది. సదరు బీఎల్వో తను కొత్తగా వచ్చానని, సంబంధిత పోలింగ్ బూత్ తెలవదని, ఎవరినైనా ఏర్పాటు చేయాలని సూపర్వైజర్కు సమాచారమిచ్చినా స్పందించకపోగా, సర్ ఫారాలను అంగన్వాడీలో పెట్టుకొని కూర్చోవాలని, ఓటర్లు వస్తే ఇవ్వాలని సదరు అధికారి ఉచిత సలహా ఇచ్చినట్లు సమాచారం.
93 శాతం సర్ ఫారాల పంపిణీ
జిల్లాలో సర్ ఫారాల పంపిణీ ప్రక్రియ 93.37 శాతం పూర్తయ్యింది. జిల్లాలో 10,17,671 మంది ఓటర్లుండగాజజ ఇప్పటివరకు 9,50,173 ఓటర్లకు ఫారాలను పంపిణీ ప్రక్రియను పూర్తి చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో 2,51,255 మంది ఓటర్లుండగా.. 98.07 శాతంతో 2,46,406 మంది ఓటర్లకు ఫారాలను పంపిణీ చేశారు. పరిగి నియోజకవర్గంలో 2,76,260 మంది ఓటర్లుండగా.. 2,57,922 మంది ఓటర్లకు, వికారాబాద్ నియోజకవర్గంలో 2,37,921 మంది ఓటర్లకుగాను 2,18,863 మంది ఓటర్లకు, తాండూరు నియోజకవర్గంలో 2,52,235 మంది ఓటర్లకుగాను 2,26,982 మంది ఓటర్లకు సర్ ఫారాలను బీఎల్వోలు అందజేశారు.
జిల్లాలో 7,85,495 ఓటర్లకు మ్యాపింగ్
సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 77.65 శాతం మేర ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 10,17,671 మంది ఓటర్లుండగా.. 7,85,495 మంది ఓటర్లకు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. మరో 2,27,454 మంది ఓటర్లకు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియ చేయాల్సి ఉన్నది. పరిగి నియోజకవర్గానికి సంబంధించి 84.08 శాతం పూర్తికాగా.. 2,32,111 మంది ఓటర్లకు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయగా.. వికారాబాద్ నియోజకవర్గంలో 79.98 శాతానికి.. 1,84,674 మంది ఓటర్లు., తాండూరు నియోజకవర్గంలో 66.29 శాతానికి.. 1,65,637 మంది ఓటర్లు., కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి 79.78 శాతానికి.. 2,00,073 మంది ఓటర్లకు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.
2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరగగా, ప్రస్తుతం మళ్లీ ఎస్ఐఆర్ను ఎన్నికల సంఘం చేపట్టింది. 2002 ఓటరు జాబితాతోపాటు 2025 ఓటరు జాబితాను బీఎల్వోలకు అందించి 2002 ఓటరు జాబితా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి పాత లిస్ట్‌లోని పేర్లను కొత్త జాబితాలోనూ ఉన్నట్లయితే మ్యాపింగ్ చేస్తున్నారు. 2002లో ఓటరు జాబితాలో పేరు లేకుండా ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు ఉన్నట్లయితే అప్పటి జాబితాలో కుటుంబీకుల పేరు ఉన్నట్లయితే వారిని ఆధారంగా తీసుకొని మ్యాపింగ్ చేస్తున్నారు.