దుబ్బాక, డిసెంబర్ 30: చేనేతలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ ఎల్ రమణ హెచ్చరించారు. చేనేత వస్ర్తాలు, ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ విధించడాన్ని నిరసిస్తూ గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చేనేత కార్మికులు చేనేత మహా ధర్నా నిర్వహించారు. అంతకుముందు బీజేపీ, మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. మహాధర్నాకు సంఘీభావం ప్రకటించిన సందర్భంగా ఎల్ రమణ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడేందుకు చేనేతలు చేపట్టిన ఉద్యమం మరోసారి చరిత్రలో నిలువబోతున్నదన్నారు.
చేనేతలను ఇబ్బందులకు గురిచేసేందుకే కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను రద్దు చేసిందని మండిపడ్డారు. మహాత్మాగాంధీ బున్కర్ బీమా యోజన పథకాన్ని రద్దు చేయటమేగాక జీఎస్టీ విధించడం బాధాకరమన్నారు. పెంచిన జీఎస్టీ రద్దు చేసేంతవరకు ఉద్యమం కొనసాగించాలని నేతన్నలకు పిలుపునిచ్చారు. చేనేత మహోద్యమ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘాలు, పద్మశాలీ, నీలకంఠ కుల సంఘాల నాయకులు బూర మల్లేశం, బోడ శ్రీనివాస్, బంగారయ్య, రమేశ్, సత్యానందం, చందు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.