Soil Mafia | కందుకూరు, ఫిబ్రవరి 9 : మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నది. రాత్రి అయ్యిందంటే చాలు వందల టిప్పర్లతో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నారు. మండలంలోని 35 గ్రామపంచాయలతో పాటు అనుబంధ గ్రామాల్లో ఈ చీకటి దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. అయినా సంబంధిత అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.
మట్టి మాఫియా అక్రమార్కులపై ఎవరైనా ఫిర్యాదు చేసినా కూడా తూతూమంత్రంగా కేసులు పెట్టి అధికారులు వదిలేస్తున్నారు. పైగా ఫిర్యాదు చేసిన వారి సమాచారాన్ని అక్రమార్కులకు చేరవేస్తున్నారు. ఈ మట్టిని ప్రభుత్వ, అసైన్డ్ భూముల నుంచే జేసీబీలతో తవ్వి టిప్పర్లలో తీసుకెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజు ఇలా అక్రమంగా మట్టిని తరలిస్తుండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని అంటున్నారు. వీరికి పలువురు అధికారుల అండదండలు ఉండటంతో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. గ్రామాల్లో చాలామంది ఈ మట్టి దందా చేస్తున్నారు. నల్ల మట్టిని చెరువుల నుంచి తీసుకొచ్చి ఇటుక బట్టీల వ్యాపారాలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత ఉన్నతాధికారులు చొరవ తీసుకుని మట్టి దందాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.