ఉప్పల్, సెప్టెంబర్ 2 : స్ట్రీట్ లైటింగ్ స్తంభం మీదపడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం తెల్లావారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానకుల కథనం ప్రకారం నాచారం కార్తీకేయనగర్‌కు చెందిన సాత్విక్(23) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితుడిని కలవడానికి వెళ్లి తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో నాచారం ప్రధాన రహదారిలో ఈఎస్ఐ-నాచారం చౌరస్తా ప్రాంతంలో వినాయకుడి నిమజ్జన ఊరేగింపు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో వినాయకుడి ఊరేగింపులో పైభాగం కేబుల్ వైర్‌ను తగలడంతో దీనికి అనుబంధంగా ఉన్న స్ట్రీట్ లైటింగ్ స్తంభం, మరో స్తంభం విరిగిపడింది. ఇదే సమయంలో ద్విచక్రవాహనంపై వస్తున్న సాత్విక్ తలకు బలంగా తగిలింది. దీనితో సాత్విక్ మృతిచెందాడు. స్తంభం తుప్పుపట్టిన స్థితిలో ఉండటంతో విరిగిపోయినట్లు తెలుస్తున్నది. నిమజ్జనం వాహనం డ్రైవర్ ఏడుకొండలు, మండప నిర్వాహకుడు వెంకటేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.