Hyderabad Metro | సిటీబ్యూరో: మెట్రో స్టేషన్లో ఖాళీ జాగా లేదంటూ ప్రయాణికులను అడ్డుకున్న ఘటనపై ఇప్పటివరకు మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆగస్టు 26న రాయదుర్గం మెట్రో స్టేషన్ పరిధిలో జరిగినా, దీనిపై చర్యలు తీసుకోలేదు. రాయదుర్గం మెట్రో స్టేషన్ లోపలికి రాకుండా ప్రయాణికులను రోడ్డుపైనే నిలిపివేశారు. కనీసం మెట్రో మార్గంలో ఉండే మెట్లపై నిలబడే వీల్లేకుండా ప్రయాణికులను అడ్డుకోవడంపై ఆందోళన వ్యక్తమైంది.
అయినా నిర్వహణ సంస్థ మాత్రం దీనిపై నోరు మెదపలేదు. గడిచిన ఏడాది కాలంగా నగరంలో మెట్రో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడం, మౌలిక వసతులు, మెరుగైన రవాణా సౌకర్యాలు తగ్గిపోవడం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 26న జరిగిన ఘటన మెట్రో నిర్వహణ లోపాలను బట్టబయలు చేసింది. ఓవైపు ప్రయాణికులు రావడం లేదని చార్జీలు పెంచడంపై దృష్టి సారించిన మెట్రో సంస్థ… అందుకు తగిన సదుపాయాలు కల్పించడం లేదనే విమర్శలను ఎదుర్కొంటోంది. పెరిగిన రద్దీకి అనుగుణంగా అదనపు బోగీలను ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు.
మెట్రో సంస్థకు ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలో ప్రయాణికులే కీలకం. కానీ వారిని ఇబ్బందులకు గురి చేసేలా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కానీ ఇలాంటి విషయాలపై మెట్రో సంస్థ దృష్టి పెట్టడం లేదు. కనీసం ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని ఘటనపై విచారణ చేయలేదు. ఎందుకు మెట్రో స్టేషన్లోకి వందలాది మంది ప్రయాణికులను రాకుండా అడ్డుకున్నారనే విషయంపై ఇప్పటికీ అటు మెట్రో సంస్థ కానీ, ఇటు నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ కానీ చర్యలు కాదు కదా.. కనీసం స్పందించలేదు.