ఊట్కూర్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి తక్షణమే పత్తి రైతులను ( Cotton Farmers) ఆదుకోవాలని సామాజిక కార్యకర్త ( Social activist protests) హెచ్. నరసింహ( Narasimha) డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన నరసింహ బుధవారం గ్రామంలోని వివేకానంద విగ్రహం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటలకు నిరసన దీక్ష ప్రారంభించిన ఆయన మధ్యాహ్నం 4 గంటల వరకు తన దీక్షను కొనసాగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అధిక వర్షాలతో పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిని రైతులు కోలుకోలేని పరిస్థితి ఉందని, రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించి పత్తి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
పత్తి పంటను 20శాతం తేమతో కొనుగోలు చేసి ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ధర చెల్లించాలని, వరి, మొక్కజొన్న పంటలకు సైతం నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తిని ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని కొత్త నిబంధనను తెరమీదికి తెచ్చిందని దీనిని వెంటనే విరమించుకొని ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రైతులు రాఘవేంద్ర, నాగిరెడ్డి, హన్మంతు, చిన్న నర్సింహా, ఆంజనేయులు, గుడిసె రాజు, అశోక్, రాజప్ప, తులసీదాస్, తిరుపతి, వెంకటప్ప, వడెప్ప, బడేసాబ్, నరేష్, ఆశప్ప , రాజమూరి తదితరులు మద్దతు తెలిపారు.