నాగర్‌కర్నూల్, నవంబర్ 4 : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత చిన్నపాటి వర్షంతో ప్రారంభమై 2 నుంచి 4 గంటల వరకు ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, లోతట్టు ప్రాంతాల్లోనీ కాలనీలను వరద ముంచెత్తింది. అంబేద్కర్ చౌరస్తా, టెలిఫోన్ ఎక్సేంజ్, లిటిల్‌ఫ్లవర్ హైస్కూల్, సుఖజీవన్ ఫంక్షన్‌హాల్ ఏరియాలోని ప్రధాన రహదాలన్నీ కుంటలను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ఇండ్లల్లోకి నీరు చేరగా.. కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. నీటిని తోడి వేసేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారిపై వర్షపునీరు పెద్ద ఎత్తున నీరు నిలిచింది. 9 జంక్షన్ వద్ద నాలుగు ఫీట్ల ఎత్తులో ఉన్న డివైడర్ పైనుంచి నీరు పారింది. కేసరి సముద్రం వైపు వెళ్లాల్సిన వర్షపునీరు ప్రధాన రహదారిపైనే నిలిచిపోయింది. ట్రాఫిక్‌జాం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ పొడవునా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జేసీబీ సాయంతో రోడ్డుపై నిలిచిన వర్షపునీటిని చెరువు వైపునకు తోడిపోశారు. ఇతర మార్గాల నుంచి వాహనాలను మళ్లించారు. కాలనీల్లోని రహదారులపై రెండు ఫీట్ల ఎత్తులో నీరు పారింది. సాయంత్రం విద్యా సంస్థలు వదిలే సమయం కావడంతో స్కూల్, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, బైకులు రోడ్లపైకి రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి ఉధృతి తగ్గే వరకు పెద్ద వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు. మొత్తానికి ఎన్నడూ లేనంతగా కుంభవృష్టి పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ధన్వాడ/మరికల్, నవంబర్ 4 : రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి రైతులకు అపారనష్టం వాటిల్లింది. మరికల్ మండలంలోని జిన్నారం, కన్మనూర్, చిత్తనూర్ గ్రామాల్లో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం నీటి పాలైంది. ధన్వాడ మండలంలోని గోటూరు, కిష్టాపూర్, కొండాపూర్ గ్రామాల్లోనూ చేతికొచ్చిన
వరి పంట చేజారిపోయిందని రైతులు కన్నీరు పెడుతున్నారు. గోటూరులో వరి పంట పూర్తిగా నేలకొరిగి మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
చారకొండ, నవంబర్ 4 : మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తుర్కలపల్లి జలమయంగా మారింది. గ్రామ సమీపంలో ఉన్న పెద్దకుంట తెగిపోవడంతో కుంటలో నీళ్లు నిల్వ ఉండక కురుస్తున్న వర్షపు నీరు వ్యవసాయ పొలాల్లో నుంచి గ్రామంలోకి చేరుతున్నాయి. దీంతో ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లలో ఉన్న నిత్యావసర వస్తువులుతోపాటు సామగ్రి మొత్తం తడిసి ముద్దయ్యాయి. ఇటీవల కురిసిన మొంథా తుఫాన్‌తో వరద నీరు ఇండ్లలో నీరు చేరడంతో స్థానిక ఎమ్మెల్యే పర్యటించి అధికారులకు గ్రామంలో వరదనీరు రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో మళ్లీ గ్రామంలో వరద నీరు చేరాయి. ఇప్పటికైనా ఉన్నాతాధికారులు స్పందించి గ్రామంలోకి వరద నీరు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మాగనూరు, నవంబర్ 4 : మాగనూరు మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో మంగళవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. మండలంలోని రైతులు అధిక మొత్తంలో వరి సాగు చేయగా ఇటీవల పంటలు కోసి ఆరబెడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వర్కూర్, నేరడుగం గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి వందలాది ఎకరాలకు సంబంధించిన ధాన్యం తడిసి పోయింది. అయితే ప్రభుత్వం కనీసం రైతులకు టార్పాలిన్లు కూడా అందించకపోవడంతో రైతులు సొంతంగా తెచ్చుకున్న టార్పాలిన్లు కవర్లతో మొత్తం ధాన్యాన్ని కాపాడుకోలే కపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం ఆరబెట్టి అమ్ముకుందామనుకున్న సమయంలో అకాల వర్షం అపార నష్టం కలిగించిందని రైతులు వాపోతున్నారు. తడిచిన ధాన్యం చూసి కండ్లల్లో కన్నీళ్లు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా టార్ఫాలిన్లు అందజేసి ఆదుకోవాలని అన్నదాతలు కోరారు.