కొల్లాపూర్, నవంబర్ 4 : కోరి తెచ్చుకున్న కాంగ్రె స్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తోందని కొల్లాపూర్‌కు చెందిన మొక్కజొన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో రాజులా బతికిన రైతు ల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో అధమస్థాయికి దిగజారిపోయిం ది. మొక్కజొన్న పంటకు సరిపడా యూరియాను ప్రభుత్వం సకాలంలో అందించకపోయినా ప్రకృతి కరణించడంతో మొక్కజొన్న రైతుకు ఎకరానికి సగటున 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అయి తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తెలంగాణ మార్క్‌ఫెడ్ ద్వారా ఎకరాకు కేవలం 18 క్వింటాళ్లు వరకు మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది.
నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 58 వేల ఎకరాల్లో మొక్కజొన్న వానకాలం పంటగా రైతులు సాగు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అంతేకాదు ఎకరాకు సగటున 30 నుంచి 35 క్విం టాళ్ల వరకు మొక్కజొన్న పంట దిగుబడి వచ్చినట్లు అధికారుల గణంకాల ద్వారా తెలుస్తోంది. 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండంతో మిగిలిన మొక్కజొన్న పంటను తప్పని పరిస్థితిలో దళారుల చేతిలో రైతులు పెడుతున్నారు. కేంద్ర ప్రభు త్వం నిర్ణయించిన మద్దతు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2400 చెల్లిస్తుంటే దళారులు మాత్రం క్వింటాకు రూ.1700 నుంచి రూ. 2050 మాత్రమే చెల్లిస్తున్నారు. రైతుల నుంచి మొక్కన్న పంటను కొనుగోలు చేసిన దళారులు తిరిగి రైతుల పేరుపై తెలంగాణ మార్క్‌ఫెడ్‌కు మద్దతు ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో మొక్కజొన్న రైతులు అప్పుల ఊబీలో నెట్టివేయబడుతున్నారు. మొక్కజొన్న పంటను సాగుచేసే ఎకరాకు 60వేల దాకా పెట్టుబడి పెడుతున్నారు. అయితే ప్రభుత్వం పెట్టిన పరిమితితో ప్రతి మొక్కజొన్న రైతు రూ. 40,800 నష్టపోవడం జరుగుతుందని రైతు సంఘా ల నాయకులు పేర్కొంటున్నారు. అకాల వర్షాలతో తేమశాతం ఉన్న మొక్కజొన్న పంటలను ప్రభుత్వం నాణ్యత పేరుతో కొనుగోలు చేయకుండా వదిలివేస్తున్నది. మార్కెట్ యార్డుల్లో వున్న దళారులు తక్కువ ధరకే రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రావ డం లేదని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు.
రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా తెలుస్తోంది. అక్టోబర్ ప్రారంభంలో మొక్కజొన్న పంట చేతికి వచ్చిన నవంబర్ మొదటి వారం గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మొక్కజొన్న కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. కేంద్ర ఏజెన్సీ నాఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు అవకాశం ఉన్నా ఆ వైపు ప్రయత్నంలో ప్రభుత్వ చిత్తశుద్ధి కొరవడినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
సాధారణంగా ఎకరాకు మొక్కజోన్న పంట 30 నుంచి 35 క్వింటాల వరకు దిగుబడి వచ్చిన 18 క్వింటాళ్ల వరకు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు పరిమితి పెట్టడంతో తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు విషయంలో పెట్టిన పరిమితిని తొలగించాలని సోమవారం కొల్లాపూర్‌లో మార్కెట్ యార్డు ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం రైతుల పెట్టుబడికి సరైన సమయంలో సహాయం చేయడం లేదు మళ్లీ పండించిన పంటలను విక్రయించుకునేందుకు అవకాశం లేకుండా పరిమితిలు పెట్టడం అంటే సమాఖ్య పాలనలోని రైతుల ఆత్మహత్యల చీకటి రోజులను మళ్లీ తీసుకొని రావడమని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే రైతుల ఆందోళన నేపథ్యంలో మార్కెటింగ్ అధికారులు ప్రభుత్వానికి ఎకరాకు 35 క్వింటాళ్ల చొప్పున మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి 25 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసేలా రేపు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని అధికారుల సమాచారం.