e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆరుగురు ఏకగ్రీవం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆరుగురు ఏకగ్రీవం

  • మిగిలిన 6 స్థానాల్లో పోటీలో 26 మంది..
  • అక్కడా గులాబీ అభ్యర్థులదే విజయం!
  • ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ..
  • ఏకగ్రీవమైన జిల్లాల్లో కోడ్‌ ఎత్తివేత: గోయల్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన ఆరు స్థానాలకోసం 26 మంది పోటీ పడుతున్నారు. ఈ ఆరు స్థానాల్లో డిసెంబర్‌ 10న ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్‌ చెప్పారు. ఏకగ్రీవమైన స్థానాలు ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్‌ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం ముగిసింది. పలువురు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, మరికొన్ని నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో ఆరు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. పరిశీలన సమయంలో నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో బరిలో మిగిలినవారిలో నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత, రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు ఏకగ్రీవమయ్యారు. స్వతంత్ర అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో వరంగల్‌లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ నుంచి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి ఏకగ్రీవమయ్యారు. వీరి ఎన్నికను ధ్రువీకరించినరిటర్నింగ్‌ అధికారులు వారికి శుక్రవారం నాడే గెలుపు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

ఆరుస్థానాలకు ఎన్నికలు: సీఈవో శశాంక్‌గోయల్‌

ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నల్లగొండ, ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లోని ఆరు స్థానాలకు షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల 10న ఎన్నికలు నిర్వహించనున్నామని సీఈవో శశాంక్‌గోయల్‌ చెప్పారు. అదిలాబాద్‌ జిల్లాలో ఉన్న ఒక్క స్థానానికి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఈ జిల్లాలో 937 మంది ఓటర్లున్నారని, 8 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరుగుతుందని తెలిపారు. కరీంనగర్‌లోని రెండు నియోజకవర్గాలకు 10 మంది పోటీలో ఉన్నారు. ఇక్కడ 1324 మంది ఓటర్లు ఉండగా, 8 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరుగుతుందని గోయల్‌ చెప్పారు. మెదక్‌ జిల్లాలోని ఒక్క స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ఈ జిల్లాలో 1026 మంది ఓటర్లు ఉండగా, 9 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో ఉన్న ఒక్క స్థానానికి ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పారు. ఈ జిల్లాలో 1271 మంది ఓటర్లు ఉండగా, 8 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక్క స్థానానికి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. ఈ జిల్లాలో 768 మంది ఓటర్లు ఉండగా 4 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏకగ్రీవమైన అభ్యర్థులకు గెలుపు ధ్రువీకరణ పత్రాలు అందించిన మరుక్షణం నుంచే ఎన్నికల కోడ్‌ రద్దయిందని గోయల్‌ స్పష్టం చేశారు. అభ్యర్థుల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై విచారణ జరిపి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామన్నారు.

గులాబీ గెలుపు లాంఛనమే!

- Advertisement -

రాష్ట్రంలో మిగిలిన ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు లాంఛనమేనని తెలుస్తున్నది. ఆదిలాబాద్‌ నుంచి దండె విఠల్‌, మెదక్‌ నుంచి డాక్టర్‌ వంటేరి యాదవరెడ్డి, ఖమ్మం నుంచి తాతా మధుసూదన్‌, నల్లగొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, కరీంనగర్‌లోని రెండు స్థానాల నుంచి ఎల్‌ రమణ, టీ భానుప్రసాదరావు టీఆర్‌ఎస్‌ పక్షాన పోటీ చేస్తున్నారు. ఎన్నికలు జరుగనున్న అన్ని జిల్లాల్లోనూ 80 శాతానికి పైగా టీఆర్‌ఎస్‌కు చెందినవారే స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. దీంతో గులాబీ పార్టీ అభ్యర్థుల గెలుపు లాంఛనమే కానున్నది.

ఏకగ్రీవ ఎమ్మెల్సీలకు కేటీఆర్‌ అభినందన

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అభినందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు శుక్రవారం ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. నిజామాబాద్‌ నుంచి కల్వకుంట్ల కవిత, వరంగల్‌ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, మహబూబ్‌నగర్‌ నుంచి కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారు.

అందరికీ ధన్యవాదాలు

నిజామాబాద్‌, కామారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతినిధిగా నన్ను మరోసారి శాసన మండలికి పంపినందుకు అందరికీ ధన్యవాదాలు. అన్ని పార్టీల్లో ఉన్న స్థానిక ప్రతినిధులందరూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను, పనులను గమనించారు. అందుకే పోటీలేకుండా నా విజయానికి అవకాశం కల్పించారు. నా విజయానికి సహకరించిన నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందరికీ కృతజ్ఞతలు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే ఇక్కడి ప్రజా ప్రతినిధులందరి ఏకైక ఎజెండా. అందుకు తగ్గట్టుగా పని చేస్తాం.- కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ

ధ్రువపత్రాలు అందుకున్న విజేతలు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, కామారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభా రాజు, ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌ పాల్గొన్నారు. ధ్రువీకరణ పత్రం అందుకున్న తర్వాత కవిత నివాసం వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు. కవితతోపాటు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి కూడా వరుసగా రెండోసారి మండలికి ఎన్నికయ్యారు.

పోచంపల్లి.. రెండోసారి

వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఏకగ్రీవమైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి శాసనమండలికి ఎన్నికవడం ఇది రెండోసారి. 2019లో జరిగిన ఉప ఎన్నికలో శ్రీనివాస్‌రెడ్డికి 90 శాతానికిపైగా ఓటర్లు మద్దతు తెలిపారు. ఈసారి ఆయనపై 13 మంది పోటీకి దిగారు. వీరిలో 10 మంది నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, ముగ్గురు ఉపసంహరించుకున్నారు. దీంతో పోచంపల్లి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. శాసనమండలిలో ప్రస్తుతం హనుమకొండ జిల్లాకు చెందిన వారే ఐదుగురు ఉన్నారు. కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బండా ప్రకాశ్‌, మధుసూదనచారితోపాటు తాజాగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి హనుమకొండ జిల్లాకు చెందిన వారే. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్సీగా 2028 వరకు కొనసాగుతారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement