ఢిల్లీ,జూన్ 25: దేశంలో ఆరు రకాల కొవిడ్-19 వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. భారతదేశంలో తయారైన జైడస్ కాడిల్లా ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి డిఎన్ఎ- ప్లాస్మిడ్ వ్యాక్సిన్‌ను త్వరలో అందుబాటులోకి రానున్నది. అలాగే బయోలాజికల్ ఇ-ప్రోటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నామని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ)కు చెందిన కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ నరేంద్ర కుమార్ అరోరా తెలిపారు. ఈ వ్యాక్సిన్ల పరీక్షలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
“ఈ టీకా సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావొచ్చని ఆయన వెల్లడించారు. 2-8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయగల భారతీయ ఎం-ఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్ కూడా సెప్టెంబర్ నాటికి అందుబాటులో రానుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జాన్సన్ & జాన్సన్ తయారు చేసిన నోవావాక్స్ అనే మరో రెండు టీకాలు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉన్నది. జూలై మూడవ వారం నాటికి భారత్ బయోటెక్,ఎస్ఐఐల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఆగస్టు నాటికి నెలలో 30-35 కోట్ల డోసులను సేకరించాలని మేము భావిస్తున్నాము ”. తద్వారా రోజుకు కోటి మందికి టీకాలు వేయడానికి వీలు కలుగుతుందని డాక్టర్ అరోరా చెప్పారు.