బెంగళూరు : కర్ణాటక, గోవా, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటీవలి కాలంలో వినని ఘరానా దోపిడీ జరిగిందా? రూ.400 కోట్లతో రెండు కంటెయినర్లు మాయమైపోయాయా? నిరుడు అక్టోబర్‌లో జరిగిన ఈ చోరీ ఇప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చింది? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ కిడ్నాపింగ్ కేసులో బాధితుడు ఇవన్నీ జరిగాయని చెప్తున్నారు. బెళగావి జిల్లా, ఖానాపూర్ తాలూకాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో చొర్లఘాట్ వద్ద ఈ కంటెయినర్లు అదృశ్యమయ్యాయని అంటున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సందీప్ పాటిల్ (35) రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా చేస్తున్నారు. ఆయన నాసిక్ గ్రామీణ పోలీసులకు ఈ నెల 1న ఫిర్యాదు చేశారు. విరాట్ గాంధీ అనే ఎంప్లాయర్‌తో సమావేశానికి రావాలని పిలిచి, తనను కిడ్నాప్ చేసి, ఓ నెలకుపైగా నిర్బంధించి, కొట్టారని ఆరోపించారు. రద్దయిన రూ.2,000 నోట్లతో వెళ్తున్న కంటెయినర్లు అదృశ్యమవడానికి కారణం తానేనని కిడ్నాపర్లు ఆరోపించారని చెప్పారు. కంటెయినర్ల జాడ చెప్పాలని బెదిరించారని తెలిపారు. ఈ నగదు విలువ రూ.400 కోట్లు అని, పరిహారంగా ప్రస్తుత కరెన్సీలో రూ.100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. పాటిల్ పోలీసుల రక్షణ కోరడానికి ముందు ఓ వీడియో స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు.
పాటిల్ స్టేట్మెంట్ ప్రకారం, నగదును గోవా నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఆశ్రమానికి పంపిస్తున్నారు. రద్దయిన రూ.2,000 నోట్లను కమీషన్ ప్రాతిపదికపై మార్చుకోవడం కోసం తరలిస్తున్నారు. ఈ కంటెయినర్లు నిరుడు అక్టోబర్ 22న అదృశ్యమైనట్లు చెప్తున్నారు కానీ ఈ ఆరోపణలను దర్యాప్తు అధికారులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. బెళగావి పోలీస్ సూపరింటెండెంట్ కే రామరాజన్ ఇటీవల మాట్లాడుతూ, కర్ణాటక నుంచి ఈ కంటెయినర్లు వెళ్లాయని చెప్పడానికి సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల కథనాలు వంటి స్వతంత్ర సాక్ష్యాధారాలేవీ లేవన్నారు. అయితే, సందీప్ పాటిల్‌ని కిడ్నాప్ చేసి, దాడి చేసిన కేసులో మహారాష్ట్ర పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో జయేష్ కదమ్, విశాల్ నాయుడు, విరాట్ గాంధీ ఉన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న కిశోర్ సావ్లా కోసం గాలిస్తున్నారు. కిశోర్ థాణెలో బిల్డర్‌గా పని చేస్తున్నారు. నిజంగా రూ.400 కోట్లు దోపిడీ జరిగిందా? ఇతర ఆర్థిక వివాదంలో కిడ్నాప్ జరిగిందా? అనే అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరా తీస్తున్నది. ఫిర్యాదుదారు ఇచ్చిన సమాచారాన్ని తనిఖీ చేయడం కోసం నాసిక్‌కు బెళగావి పోలీసులు వెళ్లారు. దొంగతనం జరిగినట్లు అధికారికంగా ఎఫ్ఐఆర్ కర్ణాటకలో నమోదు కాలేదు. తమ అధికార పరిధిలో నేరం జరిగినట్లు రుజువు కోసం స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గోవా పోలీసులు ఈ నగదు మూలాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ నగదును తిరుపతికి తరలిస్తున్నట్టు పలు వార్తలు వచ్చాయి.