హైదరాబాద్, ఆట ప్రతినిధి: మణిపూర్‌లో జరిగిన స్కూల్ గేమ్స్ ఆఫ్ ఇండియా అండర్-17 జాతీయస్థాయి జూడో పోటీల్లో రాష్ర్టానికి చెందిన యువ ప్లేయర్ ప్రవీణ్‌కుమార్ సత్తాచాటాడు. బాలుర 45కిలోల విభాగంలో బరిలోకి దిగిన ప్రవీణ్‌కుమార్ కాంస్య పతకంతో మెరిశాడు. షేక్‌పేటలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ప్రవీణ్‌కుమార్ ఇప్పటికే జాతీయస్థాయిలో నాలుగు పతకాలు సొంతం చేసుకున్నాడు.
పేద కుటుంబానికి చెందిన ప్రవీణ్‌కుమార్..అంచలంచెలుగా ఎదిగి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. తాను సాధించిన పతకాలు చూసేందుకు అమ్మనాన్న ఉంటే చాలా సంతోషించే వారని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాంస్యంతో రాణించిన ప్రవీణ్‌తో పాటు అతని కోచ్ చందనగిరి రామును రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కైలాసం యాదవ్, ప్రధాన కార్యదర్శి అజిత్ అభినందించారు.