న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) మంగళవారం 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) వ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను ప్రారంభించింది. ఈసీని రాజీపడిన ఎన్నికల సంఘమని ఆరోపించిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సర్ కార్యక్రమాన్ని మోసపూరిత చర్యగా అభివర్ణించింది. ఈసీ చేపట్టిన ఓటరు జాబితాల ప్రక్షాళనపై తమిళనాడులోని అధికార డీఎంకే, దాని మిత్రపక్షాలు కూడా మండిపడ్డాయి. మరోవైపు తమ బూత్ స్థాయి అధికారులు(బీఎల్ఓ) ఇప్పటికే ఇంటింటినీ సందర్శించి పాక్షికంగా నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందచేసి వాటిని నింపడంలో సాయపడుతున్నారని ఈసీ తెలిపింది. ఓటరు నమోదుతో ప్రారంభమయ్యే దశ డిసెంబర్ 4 వరకు కొనసాగనున్నది. డిసెంబర్ 9న ఎన్నికల కమిషన్ ముసాయిదా ఓటరు జాబితాలను విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 7న తుది జాబితాలు విడుదల చేస్తుంది. సర్ రెండవ విడత ప్రారంభమైన రాష్ర్టాలు, యూటీలలో అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లో సర్ తీవ్ర రాజకీయ ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చేపట్టిన సర్ని అధికార టీఎంసీ వ్యతిరేకించింది. ఓటరు జాబితాలో మరింత పారదర్శకత ఉంటుందని బీజేపీ చెప్పగా టీఎంసీ మాత్రం దీన్ని చేపట్టిన సమయాన్ని, ఉద్దేశాన్ని ప్రశ్నిస్తోంది. ఓటరు జాబితాలను తారుమారు చేసేందుకు బీజేపీ ఒత్తిడితో ఈసీ పనిచేస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్లో ఒక్క ఓటు తొలగించినా మోదీ సర్కారు పతనం తప్పదని హెచ్చరించారు. ఓట్ల రిగ్గింగ్‌కు సర్‌ను ఓ రాజకీయ ఆయుధంగా బీజేపీ ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు. సర్‌కు వ్యతిరేకంగా మంగళవారం కోల్‌కతాలో మమత నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు.