న్యూఢిల్లీ, నవంబర్ 4 : ట్రిబ్యునళ్ల చైర్పర్సన్లు, వివిధ ట్రిబ్యునళ్ల సభ్యులకు ఉమ్మడి సర్వీసు నిబంధనలను నిర్దేశించే ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించాలని కోరుతూ విచారణ మధ్యలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సోమవారం పిటిషనర్ల వాదనలు విన్న సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి విజ్ఞప్తి మేరకు విచారణను వాయిదా వేసింది. పిటిషనర్ల వాదనలు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ అభ్యర్థన చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని సీజేఐ గవాయ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వైఖరిని తీసుకుని న్యాయస్థానంతో ఈ రకమైన ఎత్తుగడలకు పాల్పడుతుందని తాము ఎన్నడూ ఊహించలేదని మరో 20 రోజుల తర్వాత పదవీ విరమణ చేయనున్న సీజేఐ గవాయ్ అన్నారు. ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించాలని కేంద్రం అభ్యర్థించనున్నట్లు అటార్నీ జనరల్ విచారణ సందర్భంగా ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. తానున్న ధర్మాసనాన్ని తప్పించుకోవడానికే కేంద్ర ప్రభుత్వం ఈ ఎత్తులు చేస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించిన సీజేఐ కేంద్రం దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.