న్యూఢిల్లీ : భారతీయులకు జారీచేసిన తాత్కాలిక వీసాలను మూకుమ్మడిగా రద్దు చేయాలని కెనడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. పార్లమెంట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఓ బిల్లు ప్రకారం కొవిడ్-19 వంటి మహమ్మారి లేదా యుద్ధ సమయాలలో విదేశీయులకు మంజూరు చేసే తాత్కాలిక వీసాలను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే కెనడా ప్రభుత్వం మాత్రం ప్రత్యేకించి కొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ అధికారాలను ప్రయోగించాలని భావిస్తున్నట్లు సీబీసీ న్యూస్ వెల్లడించింది. విధానంలోని లోపాలను ఉపయోగించుకుని మోసపూరితంగా తాత్కాలిక వీసాలు పొందకుండా అడ్డుకునే అధికారాలను కూడా ఈ బిల్లులో పొందుపరచాలని కెనడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్షిప్ కెనడా(ఐఆర్సీసీ), కెనడియన్ బార్డర్ సర్వీసెస్ ఏజెన్సీస్(సీబీఎస్ఏ) నివేదికలను ఉటంకిస్తూ సీబీసీ తెలిపింది.
కెనడా ప్రభుత్వం ప్రత్యేకంగా భారత్, బంగ్లాదేశ్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొంది. తాత్కాలిక నివాసులలో ఉద్యోగులు, అంతర్జాతీయ విద్యార్థులతోపాటు సందర్శకులు కూడా ఉంటారు. కెనడా సరిహద్దులను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్‌కు సమర్పించింది. సంబంధిత మంత్రికి అపారమైన అధికారాలను కట్టబెట్టే స్ట్రాంగ్ బార్డర్స్ బిల్లుకు లిబరల్ ప్రభుత్వం ఆమోదించిన పక్షంలో వీసా దరఖాస్తులు భారీ స్థాయిలో రద్దయ్యే అవకాశం ఉందని ఇమిగ్రేషన్ న్యాయవాది సుమీత్ సేన్ గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. శాశ్వత, తాత్కాలిక వలసలకు అడ్డుకట్ట వేయాలని కెనడా ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం కోసం వేచి ఉంది.
కెనడా కళాశాలల్లో చదువుకునేందుకు పర్మిట్ల కోసం వచ్చిన భారతీయ దరఖాస్తులలో దాదాపు 74 శాతం దరఖాస్తులు ఈ ఏడాది ఆగస్టులో తిరస్కరణకు గురైనట్లు రాయిటర్స్ ఆదివారం వెల్లడించింది. 2023 ఆగస్టులో సుమారు 32 శాతం దరఖాస్తులు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. కెనడా ప్రభుత్వం ఈ నెలలోనే తన ఇమిగ్రేషన్ ప్రణాళికను వెల్లడించనున్నది. దేశంలోకి విదేశీయుల ప్రవేశాన్ని తగ్గించాలని ప్రభుత్వంపై దేశీయంగా ఒత్తిడి పెరుగుతున్నది.
జారీ అయిన తాత్కాలిక వీసాలను మూకుమ్మడిగా రద్దు చేసేందుకు ప్రభుత్వానికి అధికారాలు కట్టబెట్టే బిల్లుపై 300కి పైగా పౌర సంఘాలు తీవ్ర నిరసన తెలియచేశాయి. మూకుమ్మడిగా వీసాలను రద్దు చేయడం ద్వారా కెనడా ప్రభుత్వానికి దేశంలో ఉంటున్న విదేశీయులందరినీ ఇక్కడి నుంచి తరలించే అధికారాలు లభిస్తాయని ఆ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మూకుమ్మడిగా వీసాలను రద్దు చేసే అధికారాన్ని పొందడం ద్వారా ప్రభుత్వం పెరిగిపోతున్న పెండింగ్ వీసా దరఖాస్తుల సంఖ్యను తగ్గించాలని భావిస్తోందని ఇమిగ్రేషన్ న్యాయవాదులను ఉటంకిస్తూ బీబీసీ తెలిపింది. ఆశ్రయం కోరుతూ భారతీయులు సమర్పిస్తున్న దరఖాస్తులు భారీగా పెరిగిపోవడమే భారతీయులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
2023 మేలో కేవలం నెలకు 500 లోపలే ఈ దరఖాస్తుల సంఖ్య ఉండగా 2024 జూలైలో ఇది దాదాపు 2,000కి పెరిగిపోయింది. భారత్ నుంచి వచ్చే తాత్కాలిక వీసా దరఖాస్తులను తనిఖీ చేయడం వల్లే దరఖాస్తుల ప్రాసెసింగ్ కుంటుపడుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. 2023 జూలై చివరి నాటికి వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ సగటు సమయం 30 రోజులు ఉండగా మరుసటి సంవత్సరానికి అది 54 రోజులకు పెరిగింది. ఈ కారణంగా వీసా ఆమోదాలు 2024లోనే బాగా తగ్గిపోయాయి. జనవరిలో 63 వేల దరఖాస్తులను ఆమోదించగా జూన్‌లో అది 48 వేలకు పడిపోయింది. దశాబ్ద కాలంగా కెనడాలో చదివే అంతర్జాతీయ విద్యార్థులలో అత్యధికులు భారతీయులే ఉంటున్నారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో వీసా దరఖాస్తుల తిరస్కరణకు గురైన విద్యార్థులలో కూడా భారతీయులే అత్యధికంగా ఉండడం గమనార్హం.