న్యూఢిల్లీ: భారత క్రీడారంగంలో కీలక అడుగు పడింది. ఐపీఎల్ తరహాలో దేశీయ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రొ రెజ్లింగ్ లీగ్(పీడబ్ల్యూఎల్) రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. 2019లో చివరిసారి జరిగిన ఈ లీగ్ 2026 జనవరి మధ్యలో పీడబ్ల్యూఎల్తో అట్టహాసంగా మొదలుకానుంది. భారత గ్రామీణ రెజ్లర్లకు ప్రపంచ వేదికను అందించడంతో పాటు ఒలింపిక్ కలను సాకారం చేసేందుకు పీడబ్ల్యూఎల్ దోహదపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
మంగళవారం జరిగిన మీడియా భేటీలో జాతీయ రెజ్లింగ్ సంఘం(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ హాజరై మాట్లాడుతూ ‘మన దేశంలో రెజ్లింగ్ అనేది కేవలం ఆట కాదు. అది మన వారసత్వం. మన సంస్కృతిలో, మట్టిలో కలిసిపోయింది. మన అఖాడాలలో ఎంతో ప్రతిభ దాగుంది.’ అని అన్నాడు. సంజయ్‌కుమార్, దయాన్, అఖిల్గుప్తా, సుమిత్ పాల్గొన్నారు.