హుస్నాబాద్ టౌన్, మార్చి 3 : ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కానున్నాయని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకన్న అన్నారు. గురువారం పట్టణంలోని ఆరపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ‘మన ఊరు-మన బడి’పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇవ్వడం సంతోషకరమన్నారు. పాఠశాల అభివృద్ధికిపూర్వ విద్యార్థులు సహాయం అందించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, ఏఈ ప్రణిత్, కౌన్సిలర్లు హరీశ్, శ్రీనివాస్, వేణు, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ అయూబ్, ఎస్ఎంసీ చైర్మన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పాఠశాల అభివృద్ధికి సహకరించాలి..
హుస్నాబాద్ రూరల్, మార్చి 3 : పాఠశాల అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని సర్పంచ్ రాంచంద్రారెడ్డి కోరారు. గురువారం మండలంలోని కూచనపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ప్రజాప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సమావేశమై మౌలిక వసతులపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’కి కూచనపల్లి పాఠశాల ఎంపికైందని, దాతలు ముందుకొచ్చి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో ఎంపీటీసీ జయలక్ష్మి, ఉపసర్పంచ్ మహేశ్, పంచాయతీ కార్యదర్శి రాజమ్మ, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మన బడి ఆదర్శంగా నిలువాలి..
దుబ్బాక టౌన్, మార్చి 3 : ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో మన బడి ఆదర్శంగా నిలువాలని మున్సిపల్ చైర్పర్సన్ వనితాభూంరెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక పట్టణంలోని 18వ వార్డులో ప్రాథమిక పాఠశాలను కమిషనర్ గణేశ్‌రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం పాఠశాలలోని వసతులపై అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
‘మన ఊరు-మన బడి’ దేశానికే ఆదర్శం..
దుబ్బాక, మార్చి 3 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా మారిందని దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి అన్నారు. దుబ్బాక మండలం గంభీర్పూర్ ప్రభుత్వ పాఠశాలను ‘మన ఊరు-మన బడి’కి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గురువారం గంభీర్పూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమంలో గంభీర్పూర్ పాఠశాలను ఎంపిక చేసినందుకు సర్పంచ్ భాస్కర్, వార్డుసభ్యులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎంఈవో ప్రభుదాస్ పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య..
బెజ్జంకి, మార్చి 3 : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య దొరుకుతున్నదని ఎంఈవో పావని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంపై మండలంలోని 12 ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, ఎస్ఎంసీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
‘మన ఊరు- మన బడి’పై సమావేశం..
కోహెడ, మార్చి 3 : ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై గురువారం మండలంలోని మొదటి విడుతలో ఎంపికైన 17 పాఠశాలల్లో ఎంఈవో అర్జున్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులపై చర్చించి తీర్మానం చేశారు. సమావేశంలో సర్పంచ్‌లు, ఎస్ఎంసీ చైర్మన్లు, ఎంపీటీసీలు, ప్రధానోపాధాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ బృందం..
చేర్యాల, మార్చి 3 : మండలంలోని ఆకునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వేణు ఆధ్వర్యంలో గురువారం విద్యార్థి బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రారంభించనున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో ఆకునూరు ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలని, దానికి దాతలు ముందుకు రావాలని కోరారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు వడ్డించారు.
నేడు మన ‘ఊరు-మన బడి’పై సమావేశం..
మద్దూరు(ధూళ్మిట్ట), మార్చి 3 : ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై నేడు సమావేశం నిర్వహించనున్నట్లు ఎంఈవో నర్సింహారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మద్దూరు ఎంపీడీవో కార్యాలయంలో మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన అన్ని పాఠశాలల హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంపీపీ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి హాజరుకానున్నట్టు తెలిపారు.