పాపన్నపేట, మార్చి3: అమ్మలగన్న మాయమ్మ.. ఏడుపాయల దుర్గమ్మ.. మమ్మల్ని సల్లంగా చూడమ్మా.. అంటూ దుర్గమ్మ నామస్మరణతో ఏడుపాయల అటవీ ప్రాంతం ప్రతిధ్వనించింది. ఏడుపాయల జాతరలోనే అత్యంత కీలక ఘట్టమైన రథోత్సవం గురువారం రాత్రి వైభవంగా కొనసాగింది. చీకటిని సైతం లెక్క చేయకుండా లక్షలాది మంది భక్తులు తిలకించారు. వందలాది మంది రథాన్ని లాగారు. ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో ఎండోమెంట్ కార్యాలయం నుంచి డప్పుచప్పుళ్లతో రెవెన్యూ అధికారులను ఎదుర్కొని, అక్కడి నుంచి నేరుగా నాగ్సాన్పల్లి చేరుకున్నారు.
గ్రామ పెద్దకాపు సాయిరెడ్డిని బాజాభజంత్రీలతో ఎదుర్కొని రథం గోలి వరకు తీసుకొచ్చారు. రథం ముందు పట్టు పరిచి అన్నం వండి రాసిపోసే కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఇది నేరుగా రాజగోపురం వరకు కొనసాగింది. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించడానికి ఏడుపాయల్లో మూడు రోజుల పాటు భక్తులు తిష్ట వేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో భారీఎత్తున పోలీసు సిబ్బందిని మోహరించారు. ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి మెదక్ ఆర్డీవో సాయిరాం, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, ఈవో, అధికారులను సమాయాత్త పరిచారు.
అధికారుల సమన్వయం..
ఏడుపాయల జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారన్న ఉద్దేశంతో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి జాతరకు ముందు హరిత రెస్టారెంట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ హరీశ్ పలుమార్లు జాతర పనులను పర్యవేక్షించారు. ఉన్నత స్థాయి అధికారుల సమన్వయంతో జాతర విజయవంతంగా ముగిసింది.
పోటెత్తిన భక్తజనం..
మూడు రోజుల పాటు జరిగిన ఈ జాతరకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. రెండో రోజూ బుధవారం బండ్ల ఊరేగింపు, మూడో రోజైన గురువారం రథోత్సవాన్ని తిలకించడానికి భారీగా తరలివచ్చారు. నూతనంగా రోడ్డు వేయడంతో పోతంశెట్టిపల్లి వైపు రద్దీ భారీగా పెరిగింది. నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల వారు నాగ్సాన్పల్లి వైపు నుంచి జాతరకు వచ్చారు. ఏడుపాయల్లో రథం గోలి సమీపాన రథాన్ని రంగులు, రంగు కాగితాలతో పాటు విద్యుద్ధీపాలతో మెరిమెట్లు గొలిపేలా అలంకరించారు. ఈ కార్యక్రమం రాత్రి 11 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. దీంతో సంబంధిత అధికారులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
దుర్గమ్మను దర్శించుకున్న మాధవానందస్వామి
ఏడుపాయల దుర్గా భవానీమాతను తొగుట పీఠాధిపతి మాధవానందస్వామి గురువారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. వేకువజామునే ఏడుపాయలకు చేరుకున్న ఆయనకు ఆలయ పూజా రులు, ఈవో సార శ్రీనివాస్ పూర్ణకుంభంతో స్వాగ తం పలికారు.