కాలిఫోర్నియా, జూన్ 18 : భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభాన్షు శుక్లా రోదసి యాత్ర మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 22న ప్రయోగం చేపట్టనున్నట్టు ఇస్రో ‘ఎక్స్’వేదికగా బుధవారం వెల్లడించింది. ఈ మిషన్‌ను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ప్రైవేట్ సంస్థ యాక్సియం స్పేస్ తాజాగా వెల్లడించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో లీకేజ్‌ల కారణంగా ఇటీవల కొన్ని మరమ్మత్తులు చేపట్టాల్సి వచ్చింది.
దీనిపై వివిధ అంశాల్ని ఇస్రో మరోమారు మూల్యాంకనం చేసుకునే విధంగా యాక్సియం-4 మిషన్ ప్రయోగ తేదీని మార్చినట్టు తెలుస్తున్నది. శుభాన్షు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను ఐఎస్ఎస్కి పంపుతున్న ‘యాక్సియం-4’ మిషన్‌లోనూ సాంకేతిక సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ మిషన్‌ను షెడ్యూల్ ప్రకారం మే 29న చేపట్టాలని భావించగా, పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్నది. ఫాల్కన్-9 రాకెట్ బూస్టర్స్లో ద్రవ ఆక్సిజన్ లీకేజ్ బయటపడటంతో, రాకెట్ ప్రయోగ తేదీ జూన్ 11కు మారింది.