మాగనూర్ : మాగనూర్ కృష్ణ ఉమ్మడి మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలకు అరకోర గన్ని బ్యాగులు (Gunny bags) సరఫరా అవుతున్నాయి. దీంతో రైతులకు పూర్తిస్థాయిలో అందక అరిగోస పడుతున్నారు. ఉమ్మడి మండలాల్లో మహిళా సమాఖ్య ( IKP) , ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ( PACS) ఆధ్వర్యంలో 10 వరి కొనుగోలు కేంద్రాలు ( Paddy Purchase Centers ) ఏర్పాటు చేశారు.
రైతులు పంట కోసి 20 నుంచి 25 రోజులు గడుస్తున్నా గన్ని బ్యాగులను అందజేయకపోవడంతో అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఇప్పటివరకు 25 శాతం మాత్రమే రైతులు గన్ని బ్యాగులు తీసుకున్నారని ఇంకా 75 శాతం రైతులకు గన్ని బ్యాగులు అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులను సంప్రదిస్తే అప్పుడూ, ఇప్పుడు వస్తాయంటూ సరైనా సమాధానం చెప్పలేక దాట వేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
గురువారం మాగనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రానికి దాదాపు వందమంది రైతులు గన్ని బ్యాగులకు రాగా 50 మందికి మాత్రమే పాతవి, చినిగిన గన్ని బ్యాగులు పంపిణీ చేసి చేతులు దులుపేసుకున్నారు. మిగతా రైతులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మరో 9 కేంద్రాల్లో దారుణ పరిస్థితి ఉంది. కేసీఆర్ ప్రభుత్వ ( KCR Government ) హయాంలో గన్ని బ్యాగుల కొరత లేకుండా, రైతులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారని రైతులు గుర్తు చేసుకున్నారు.
మరోవైపు రైస్ మిల్లు యజమానులు ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉందని కిలో నుంచి ఐదు కిలోల వరకు తరుగు తీస్తు రైతుల నోట్ల మట్టి కొడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇంకో పక్క వడ్లు నింపిన మిల్లులకు తరలించాలంటే లారీల యజమానులు, డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతుల నుంచి మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.