e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News మెరిపించిన జడేజా గిల్

మెరిపించిన జడేజా గిల్

  • అరంగేట్రంలో శ్రేయస్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌
  • రాణించిన జడేజా, గిల్‌
  • భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ 258/4
  • న్యూజిలాండ్‌తో తొలి టెస్టు

క్లాస్‌ ప్లేయర్‌కు ఫామ్‌తో ఫార్మాట్‌తో సంబంధం లేదని నిరూపిస్తూ.. టెస్టు అరంగేట్రంలోనే శ్రేయస్‌ అయ్యర్‌ అజేయ అర్ధశతకంతో అదుర్స్‌ అనిపిస్తే.. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ తమ వంతుగా హాఫ్‌సెంచరీలు బాదడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన సీనియర్‌ ఆటగాళ్లు రహానే, పుజారా పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. రెండో రోజు నుంచి స్పిన్నర్లకు అనుకూలించనున్న గ్రీన్‌ పార్క్‌ పిచ్‌పై మనవాళ్లు ఇంకెన్ని పరుగులు జోడిస్తారో చూడాలి! పేసర్లకు
పెద్దగా సహకారం అందని పిచ్‌ నుంచి రివర్స్‌ స్వింగ్‌ రాబట్టి భారత టాపార్డర్‌ను దెబ్బకొట్టిన ఆరున్నర అడుగుల పొడగరి కైల్‌ జెమీసన్‌తో శుక్రవారం తొలి సెషన్‌లో టీమ్‌ఇండియాకు ముప్పు పొంచి ఉంది!

కాన్పూర్‌: ఆడుతున్నది సొంతగడ్డపై.. అందునా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌.. ఆపై టాస్‌ కూడా అనుకూలించింది. ఇంకేముంది భారత జట్టు భారీ స్కోరు చేయడం ఖాయమే అనుకుంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌ న్యూజిలాండ్‌ అంత తేలిగ్గా పరుగులు చేయనివ్వలేదు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం ప్రారంభమైన తొలి పోరు ఆరంభంలో తడబడిన టీమ్‌ఇండియా.. ఆనక తేరుకొని భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తున్నది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అరంగేట్ర ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (75 బ్యాటింగ్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. శుభ్‌మన్‌ గిల్‌ (52; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌), రవీంద్ర జడేజా (50 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు. ఒత్తిడిలో బరిలోకి దిగిన సీనియర్‌ ఆటగాళ్లు అజింక్యా రహానే (63 బంతుల్లో 35; 6 ఫోర్లు), చతేశ్వర్‌ పుజారా (88 బంతుల్లో 26; 2 ఫోర్లు) అంచనాలను అందుకోలేకపోయారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఆరున్నర అడుగుల పొడగరి కైల్‌ జెమీసన్‌ 3 వికెట్లు పడగొట్టగా, టిమ్‌ సౌథీకి ఓ వికెట్‌ దక్కింది. ఐదో వికెట్‌కు అజేయంగా 113 పరుగులు జోడించిన శ్రేయస్‌, జడేజా క్రీజులో ఉన్నారు. క్యూరెటర్‌ శివకుమార్‌ చెప్పినట్లు రెండో రోజు నుంచి పిచ్‌ స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో.. న్యూజిలాండ్‌ స్పిన్‌ త్రయాన్ని ఎదుర్కొంటూ.. టీమ్‌ఇండియా ఇంకా ఎన్ని పరుగులు చేస్తుందనేది ఆసక్తికరం!

- Advertisement -

గిల్‌ మెరుపులు..

  • మొదటి సెషన్‌29 ఓవర్లు 82 పరుగులు

ఒక వికెట్‌స్టార్‌ ఆటగాళ్ల గైర్హాజరీలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. జెమీసన్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో మయాంక్‌ అగర్వాల్‌ (13) వికెట్‌ కీపర్‌ బ్లండెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి చతేశ్వర్‌ పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పుజారా కుదురుకునేందుకు సమయం తీసుకుంటే.. మరో ఎండ్‌లో గిల్‌ బ్యాట్‌కు పనిచెప్పాడు. వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదిన ఈ యువ ఓపెనర్‌.. అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో క్రీజు వదిలి ముందకొచ్చి లాంగాన్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టి అభిమానుల్లో జోష్‌ నింపాడు. ఈ క్రమంలో గిల్‌ 81 బంతుల్లో టెస్టు క్రికెట్‌లో నాలుగో హాఫ్‌సెంచరీ తన పేరిట రాసుకున్నాడు. దీంతో టీమ్‌ఇండియా 82/1తో తొలి సెషన్‌ను సంతృప్తికరంగా ముగించింది.

ఆ ఇద్దరూ అంతంతే..

  • రెండో సెషన్‌27 ఓవర్లు72 పరుగులు3 వికెట్లు

లంచ్‌ తర్వాత తొలి ఓవర్‌లోనే భారత్‌కు భారీ షాక్‌ తగిలింది. పిఫ్టీ కొట్టి జోరుమీదున్న శుభమన్‌ గిల్‌ను జెమీసన్‌ క్లీన్‌ బౌల్ట్‌ చేశాడు. వరుసగా ఔట్‌ స్వింగర్‌లు వేస్తూ గిల్‌ను ఇబ్బందిపెట్టిన జెమీసన్‌ ఓ చక్కటి ఇన్‌స్వింగర్‌తో అతడిని బుట్టలో వేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ బాధ్యత నాయక ద్వయం రహానే, పుజారాపై పడింది. యువ ఆటగాళ్లు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో జట్టులో చోటు నిలువాలంటే భారీ స్కోర్లు చేయాల్సిన స్థితిలో వీరిద్దరూ ఆచితూచి ఆడారు. అయితే రెండు గంటలకు పైగా క్రీజులో నిలిచిన పుజారా.. సౌథీ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి

డగౌట్‌ బాటపట్టగా..

చక్కటి బౌండ్రీలతో ఆకట్టుకున్న రహానేను జెమీసన్‌ బలితీసుకున్నాడు. దీంతో రెండో సెషన్‌ ముగిసేసరికి భారత్‌ 154/4తో చిక్కుల్లో పడింది.

ఆఖరి సెషన్‌ మనదే..

  • మూడో సెషన్‌: 27 ఓవర్లు 72 పరుగులు 0 వికెట్లు

ఇరు జట్లు చెరో సెషన్‌ను పంచుకోగా.. ఆఖరి సెషన్‌లో భారత్‌ పూర్తి ఆధిపత్య కనబర్చింది. తొలి టెస్టు ఆడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా క్రీజులో పాతుకుపోవడంతో కివీస్‌ బౌలర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తూ స్ట్రయిక్‌ రొటేట్‌ చేసిన ఈ జోడీ చెత్త బంతులను బౌండ్రీలకు పంపుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపింది. దీంతో జట్టు స్కోరు 200 దాటడంతో పాటు అయ్యర్‌ అర్ధశతకం పూర్తైంది. ఫిఫ్టీ అనంతరం శ్రేయస్‌ మరింత స్వేచ్చగా ఆడగా.. అతడికి జడ్డూ చక్కటి సహకారం అందించాడు. ఆట మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా కివీస్‌ కొత్త బంతి తీసుకున్నా భారత్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. సౌథీ బౌలింగ్‌లో సింగిల్‌తో హాఫ్‌సెంచరీ మార్క్‌ చేరుకున్న జడేజా.. ‘బ్యాట్‌ సాము’తో సంబురాలు చేసుకున్నాడు. వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా మంచి స్కోరు చేయడం ఖాయంగానే కనిపిస్తున్నది.

సన్నీ చేతుల మీదుగా..

అరంగేట్ర ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌కు మ్యాచ్‌ ఆరంభానికి ముందు భారత మాజీ కెప్టెన్‌, స్టార్‌ ఓపెనర్‌ సునీల్‌ గవాస్కర్‌ టెస్టు క్యాప్‌ అందించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌.. టీమ్‌ఇండియా తరఫున టెస్టు బరిలోకి దిగిన 302వ ఆటగాడిగా నిలిచాడు. హెడ్‌కోచ్‌గా పాత పద్ధతులకు పూర్వ వైభవం కల్పిస్తున్న రాహుల్‌ ద్రవిడ్‌ కోరిక మేరకే ఆట ప్రారంభానికి ముందు గవాస్కర్‌.. యువ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాడు. ఇటీవల టీ20 అరంగేట్రం చేసిన హర్షల్‌ పటేల్‌కు భారత మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌తో క్యాప్‌ అందించిన ‘ది వాల్‌’ ఈసారి కూడా తన ప్రత్యేకత చాటుకున్నాడు. భారత క్రికెట్‌లో గతంలోనూ ఈ పద్ధతి ఉండగా.. ఇటీవలి కాలంలో జట్టులోని సీనియర్‌ ప్లేయర్లతోనే ఈ తంతు ముగిస్తూ వస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో దిగ్గజ ఆటగాళ్లతోనే టెస్టు క్యాప్‌లు అందించే సంప్రదాయం కొనసాగుతున్నది. ద్రవిడ్‌ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement