ఇస్లామాబాద్ : పాకిస్థాన్ నూతన ప్రధానిగా షబాజ్ షరిఫ్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ పార్టీ వాకౌట్ చేయడంతో ఎన్నిక లాంఛనమైంది. ప్రధానిగా ఎన్నికైన తర్వాత భారత్తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్తో మెరుగైన సంబంధాలు కోరుకుంటున్నామన్న ఆయన.. ఈ అంశాన్ని కశ్మీర్ సమస్యతో ముడిపెట్టారు. భారత్తో శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నానని.. అయితే, కశ్మీర్ సమస్యకు పరిష్కారం లేకుండా అది జరగదన్నారు. ఈ సందర్భంగా కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని లేవనెత్తారు.
2019లో బలవంతంగా ఆర్టికల్ 370ను రద్దు చేసిన సమయంలో ఎన్నో ప్రయత్నాలు చేశామని, దౌత్యం కోసం ప్రయత్నించామని పేర్కొన్నారు. కశ్మీరీల రక్తం కశ్మీర్ రోడ్లపై పారుతోందని, వారి రక్తంతో లోయ ఎర్ర మారిందన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పాకిస్థాన్ రాజకీయంగా, దౌత్యపరంగా కశ్మీర్ ప్రజలకు నైతిక మద్దతు ఇస్తుందన్నారు. సమస్యపై ప్రతి అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ సమస్యను లేవనెత్తుతామన్నారు. రెండువైపులా పేదరికం ఉందని అర్థం చేసుకోవాలని భారత ప్రధానికి మోదీ సలహా ఇస్తానని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావాలని.. ఆ తర్వాత పేదరికంపై కలిసి పోరాటం చేద్దామని మోదీని ఆహ్వానిస్తానని షరిఫ్ పేర్కొన్నారు.