‘మిమీ’ చిత్రంతో జాతీయ ఉత్తమనటిగా కేంద్ర ప్రభుత్వ పురాస్కారాన్ని అందుకున్న బాలీవుడ్ భామ కృతి సనన్ తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. బెర్లిన్‌లో నిర్వహించిన ‘వరల్డ్ హెల్త్ సమ్మిట్-2025’లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కృతిసనన్ నిలిచారు. ఇది తనకు లభించిన గొప్ప గౌరవమని కృతి ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ వేదికపై ఆమె మాట్లాడుతూ ‘ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నప్పటికీ వారి వైద్యానికి కావాల్సినన్ని వనరులు ఉండటం లేదు. స్త్రీల ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది.
ఇది తేలికైన అంశం కాదు. మానవాళి భవిష్యత్తుకు స్త్రీ మూలస్తంభం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.’ అంటూ ఆవేశంగా మాట్లాడారు కృతి సనన్. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. కోలీవుడ్ హీరో ధనుష్ కథానాయకుడిగా రూపొందుతున్న బాలీవుడ్ ప్రేమకథ ‘తేరే ఇష్క్ మే’లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. నవంబర్ 28న ఈ సినిమా విడుదల కానున్నది. అలాగే షాహిద్ కపూర్‌తో కలిసి ‘కాక్టెయిల్ 2’లో కూడా ఆమె నటిస్తున్నారు.