హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 16 : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పతకాలే లక్ష్యంగా అథ్లెట్లు సింథటిక్ ట్రాక్‌పై పరుగులు తీశారు. మూడురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 937 మంది అథ్లెట్లు పాల్గొని ప్రతిభ చాటారు. తొలిరోజే పలువురు అథ్లెట్లు రికార్డులను బ్రేక్ చేశారు. ఉమెన్స్ డిస్కస్‌త్రోలో హర్యానకు చెందిన నిఖితకుమారి (50.73), ఉమెన్స్ 100 మీటర్ల పరుగుపందెంలో మహారాష్ట్రకు చెందిన సుధీష్ణ హన్మంత, రిలయన్స్‌కు చెందిన సాక్షి గతంలో ఉన్న రికార్డులను చెరిపేశారు. కాగా, అథ్లెటిక్స్ పోటీలను గురువారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రంథాలయ జిల్లా చైర్మన్ మహమ్మద్ అజీజ్‌ఖాన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు స్టాలీజోన్స్, చైర్మన్ వరద రాజేశ్వర్‌రావు, కార్యదర్శి సారంగపాణి, డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్, ములుగు జిల్లా అధ్యక్షుడు, రెజోనెన్స్ విద్యాసంస్థల చైర్మన్ రాజిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పగిడిపాటి వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ పుల్యాల కిషన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఖేలో ఇండియా 2026 క్రీడలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. 2036లో భారత్‌లో జరగనున్న ఒలింపిక్స్ క్రీడల్లో కొన్ని గేమ్స్ రాష్ట్రంలో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు, ఇటీవల ఎంపీలందరు పీటీ ఉషను కలిసినట్లు ఆమె గుర్తు చేశారు. అనంతరం 10 వేల మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ చాటిన అథ్లెట్లకు ఎంపీ కావ్య, మేయర్ సుధారాణి, కలెక్టర్ స్నేహా శబరీష్ మెడల్స్ అందజేశారు. కోచ్‌లు శ్రీమన్నారాయణ, నాగరాజు, ఐలి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
పదివేల మీటర్ల పురుషుల పరుగుపందెంలో రిజ్వాన్(గోల్డ్ మెడల్, ఇండియన్ యూనివర్సిటీ), సచిన్ యాదవ్(సిల్వర్ మెడల్, ఉత్తర్‌ప్రదేశ్), శివాజీ కాషురాం(బ్రాంజ్ మెడల్, కర్ణాటక), ఉమెన్స్ 10 వేల మీటర్ల పరుగుపందెంలో లతిక తల్వార(గోల్డ్, రాజస్తాన్), ఆర్తి పర్వార(సిల్వర్, మహారాష్ట్ర), భుష్ర గౌరీ(బ్రాంజ్, మధ్యప్రదేశ్), మెన్స్ షార్ట్పుట్లో సిమ్రాన్జీత్కౌర్(గోల్డ్, ఢిల్లీ), జలక్ చాహల్(సిల్వర్, ఉత్తరప్రదేశ్), పూజా కుమారి(బ్రాంజ్, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, పటియాల), ఉమెన్స్ హైజంప్‌లో సీమాకుమారి(గోల్డ్, ఉత్తరప్రదేశ్), సారిక కుమావత్(సిల్వర్, రాజస్తాన్), రిమ్పాల్కౌర్(బ్రాంజ్, పంజాబ్), ఉమెన్స్ డిస్కస్‌త్రోలో నిఖితకుమారి(గోల్డ్, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ పటియాల),
కిరణ్(సిల్వర్, రాజస్తాన్), అఖిల రాజు(బ్రాంజ్, కేరళ), మెన్స్ హ్యామర్‌త్రోలో ఎస్ దినేశ్(గోల్డ్, తమిళనాడు), పవన్(సిల్వర్, రాజస్తాన్), రాబిన్ యాదవ్(బ్రాంజ్, ఉత్తరప్రదేశ్), పోల్ వాల్ట్‌లో కుమార్ కుల్దీప్(గోల్డ్, జేఎస్‌డబ్ల్యూ), ఎస్ కవిన్రాజ్(సిల్వర్, తమిళనాడు), రాంరతన్(బ్రాంజ్, రాజస్తాన్), ఉమెన్స్ 100 మీటర్స్ పరుగుపందెంలో సుదీష్ణ(గోల్డ్, మహారాష్ట్ర), సాక్షి(సిల్వర్, రిలెన్స్), తమన్న(బ్రాంజ్, ఎన్‌సీవోఈ, త్రివేండ్రం), మెన్స్‌లో దొందపాటి హరుత్యమ్ జయరాం(గోల్డ్, ఒడిశా), సదానంద కుమార్(సిల్వర్, జార్ఖండ్), లవ్కిక్(బ్రాంజ్, మహారాష్ట్ర ఉన్నారు.