కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) దేశంలో పెద్దఎత్తున రాజకీయ దుమారం కలిగిస్తున్నది. ఈసీ అధికారులు చెప్తున్న లక్ష్యాలు, ఉద్దేశాలు ఒక రకంగా ఉంటే, ఆచరణలో మాత్రం పలుచోట్ల భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాబితాను హేతుబద్ధంగా సవరణ చేయాల్సిన అధికారులు, అడ్డగోలుగా తొలగింపునకు పాల్పడుతున్నారని బాధితులు మండిపడుతున్నారు. ఎస్ఐఆర్ ప్రకటించగానే ఈసీ చిత్తశుద్ధిపై రాజకీయ, ఎన్నికల నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ బిహార్, బెంగాల్ల్లో జరిగిన సవరణ ప్రక్రియ పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలోని పెద్దల కనుసన్నల్లో రాజకీయ ఎజెండాను ఈసీ అధికారులు అమలు చేస్తున్నారని రాజకీయ పార్టీల నేతలు, సామాజికవేత్తలు, ప్రజాస్వామికవాదులు మండిపడుతున్నారు.
ఓటరు జాబితా సవరణతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని ఈసీ అధికారులు చెప్తున్నారు. కానీ సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా, ఎన్నికల వ్యవస్థకు విఘాతంలా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటర్లను ఏకపక్షంగా తొలగించడం దారుణమని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో ధర్మయుద్ధం చేయలేక, లక్ష్యంగా చేసుకున్న వాళ్ల ఓటు హక్కును కాలరాయడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నవాళ్లకు ఈసీ అధికారులు కొమ్ముకాస్తున్నారని రాజకీయవర్గాల్లో ఓ అభిప్రాయం ఉన్నది.
కేంద్రంలోని బీజేపీ సర్కార్, తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒకలా, ప్రతిపక్షంలో ఉన్న రాష్ర్టాల్లో మరోలా ఎస్ఐఆర్ జరిగేలా ఈసీని ప్రభావితం చేస్తున్నదని, ఇందుకు పలు ఉదంతాలే నిదర్శనమని విపక్ష పార్టీల నేతలు చెప్తున్నారు. లక్షల ఓట్లను తొలగించడం, వందల ఓట్లను మాత్రమే తిరిగి చేర్చడం అభ్యంతరకరమని అంటున్నారు. ముఖ్యంగా బిహార్, బెంగాల్లో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చేలా ఉన్నాయని ఉదహరిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్న ఎస్ఐఆర్ ఉద్దేశాలు, ఆచరణలో పరిస్థితులకు పొంతనలేకుండాపోయింది. కేంద్రంలోని బీజేపీ రాజ్యవిస్తరణ కాంక్షకు ఈసీ బాటలు వేస్తున్నదనే విమర్శలు ఎదుర్కొంటున్నది. ఇందుకు మొదటి మెట్టుగా ఓటరు జాబితాను ఈసీ సవరిస్తే, ఆ తర్వాత కేంద్ర బలగాలను, అధికార యంత్రాంగం, దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకొని రాజకీయ ప్రవేశం జరిగేలా పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 13 రాష్ర్టాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ పూర్తయింది. వీటన్నింటి సంగతి ఒక ఎత్తయితే, బెంగాల్లో జరిగిన ఎస్ఐఆర్ మరో ఎత్తు. బిహార్లోనూ చాలా విమర్శలు వచ్చాయి.
కానీ తాజాగా ఎన్నికలు జరిగిన బెంగాల్ సంగతి చూద్దాం. బెంగాల్లో అక్కడ జరిగింది మొత్తం ఓటరు జాబితా సవరణ కాదని, ఎలాగైనా బెంగాల్లో అధికారం దక్కించుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈసీని అడ్డం పెట్టుకొని అరాచకంగా వ్యవహరించిందని ప్రజాస్వామ్యం అందించిన ఓటు హక్కును కోల్పోయిన ఎంతోమంది బాధితులు చెప్తున్నారు. ఓటర్ల తొలగింపును సవాల్ చేస్తూ ప్రజలు దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఎన్నికల అధికారుల నుంచి స్పందన ఒకేలా కనిపిస్తున్నది. ముసాయిదా జాబితాలపై రాజకీయపార్టీలతో చర్చిస్తామని గొప్ప ఆదర్శాలను ఈసీ వల్లె వేస్తున్నది. కానీ బెంగాల్లో అర్ధరాత్రుల్లో తుది జాబితాలు విడుదల చేయాల్సిన అగత్యం ఎవరి అవసరం?
దేశంలో ఇప్పటికే 21 సార్లు ఓటరు జాబితా సవరణ జరిగింది. ఎప్పుడు కూడా ఇంత వివాదాస్పదం కాలేదు. ఇప్పుడే ఎందుకు అవుతున్నది అనేది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన ప్రశ్న. కేంద్రంలోని బీజేపీ వైఖరి, బీజేపీ పెద్దల సైగలతోనే అభీష్టం నెరవేర్చే పెద్దలు ఎన్నికల సంఘంలో కూర్చోవడం, వాళ్లు బీజేపీ అధికార ప్రతినిధుల తరహాలో స్పందించిన ఉదంతాలు కండ్ల ముందు కనిపిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.
ఓట్లను ఈసీ అధికారులు తొలగించారు. కొందరు బీజేపీ నేతలు, వాట్సాప్ యూనివర్సిటీ వాళ్లు కట్టు కథనాలను ప్రచారం చేస్తున్నారు. వారంతా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడిన ముస్లింలు అని, అందుకే తొలగించారని బీజేపీ ఐటీ సెల్లో వండివార్చిన కథనాలను వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ వాల్స్ మీద సర్క్యులేట్ చేస్తున్నారు.
కాబట్టి ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకించడం సరికాదని తమదైన శైలిలో ముక్తాయింపులిస్తున్నారు. అసలు వాస్తవం ఏంటంటే బెంగాల్లో తొలగించిన మొత్తం 91 లక్షల ఓట్లలో 57.47 లక్షల ఓట్లు (63 శాతం) హిందువులవి, 31.1 లక్షల ఓట్లు (34 శాతం) ముస్లింలవి, మిగతావి ఇతరులవి అని ఒక అంచనా. ఇక ఈ 34 శాతంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు ఎంతమంది ఉండొచ్చు? మిగిలిన వారు ఎవరు? అసలు 63 శాతం మంది ఎవరు? వారి ఓట్లను ఎందుకు తొలగించారు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. పెండ్లయిన తర్వాత మహిళ ఇంటి పేరు మారిందని, ఇంటి పేరులో ఒక అక్షరం అటు ఇటుగా ఉన్నదని కూడా ఓట్లను తొలగించిన ఉదంతాలు ఉన్నాయి.
ఇవి కేవలం సాకులు మాత్రమే. అసలు ఏ సాకూ లేకుండా తొలగించిన ఓట్లు ఇంకెన్నో. జాబితా నుంచి పేర్లను తొలగించడం అంటే శాశ్వతంగా తొలగించినట్టు కాదని, అప్పీల్ చేసుకుంటే, విచారణ జరిపి తిరిగి జాబితాలో చేరుస్తామని అధికారులు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు? తొలగించిన వారి పేర్లను ఎప్పుడు తిరిగి చేరుస్తారు? ఓటింగ్ అయిపోయిన తర్వాతనా? బెంగాల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. తొలగించిన వారిలో నుంచి రేప్పొద్దున అర్హులను గుర్తించి, తిరిగి జాబితాలో చేర్చితే మాత్రం ఇప్పుడు ఏమి ఉపయోగం? రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక ఓటు హక్కును కోల్పోయినట్టే కదా! ఇందుకు ఎవరు బాధ్యులు?
ఓటరు జాబితాలో పేర్లను తొలగించడం, ఓటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే పరిశీలించడం, అందులో అర్హులను గుర్తించి తిరిగి జాబితాలో చేర్చడం కోసం సమయం పడుతుంది కదా. మరి ఓ వైపు ఎన్నికల ప్రక్రియ నడుస్తుంటే, మరోవైపు ఓటరు జాబితా రూపొందించే పనిలో ఈసీ అధికారులు ఎందుకు తలమునకలయ్యారు?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చడం కోసమే అనుబంధ విభాగంగా ఈసీ వ్యవహరించిందనే విమర్శ ఉన్నది. ఇది కేవలం విమర్శనే అనుకుంటే, మరి బెంగాల్లో ఈసీకి సంబంధించిన కీలక పత్రాలపై బీజేపీ కేరళ కార్యాలయ రబ్బర్ స్టాంప్స్ కనిపించడం దేని సంకేతమో? ఇదే దారుణం అంటే, ఈ వ్యవహారంపై ఈసీ పెద్దలు ఇచ్చిన వివరణ మరో లెవెల్. ఇది క్లరికల్ మిస్టేక్ అని సెలవిచ్చారు.
క్లరికల్ మిస్టేక్ అంటే సమాచారంలో ఏదైనా పొరపాట్లు ప్రింట్ అయితే సరేలే అనుకోవచ్చు. కానీ సదరు కీలక పత్రాలపై బీజేపీ ఆఫీస్ స్టాంప్ ఎక్కడి నుంచి వచ్చినట్టో? బీజేపీ స్టాంప్ ఈసీ కార్యాలయానికి వచ్చిందా? ఆ పత్రాలే బీజేపీ ఆఫీస్కు వెళ్లి వచ్చాయా? ఇవన్నీ కూడా దేశంలో సగటు పౌరుల, ప్రజాస్వామికవాదుల సందేహాలు. లేదు లేదు.. ఇది అడగకూడదు అంటే.. సంతృప్తికరమైన సమాధానాలు దొరకని ప్రశ్నగానే మిగులుతుంది… ప్రజాస్వామ్యం కాగితాలకే పరిమితమవుతుంది. విచిత్రమేంటంటే.. ఓట్ల తొలగింపు బాధితుల్లో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు కూడా ఉన్నారట! వాళ్లు తమ ఉద్యోగ బాధ్యతగా ఎన్నికలు నిర్వహించారు గానీ, ఓటు వేయడానికి అర్హులని నిరూపించుకోలేదన్నమాట. అదీ ఎస్ఐఆర్ కథ.
బెంగాల్లో అడ్డగోలుగా ఓటర్లను జాబితా నుంచి తొలగించారంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం… ఓటరు జాబితాలో కొనసాగే హక్కు ఓటరుకు ఉంటుందని, ఎన్నికలు నిర్వహించాలనే ఒత్తిడిలో సవరణ ప్రక్రియను వక్రీకరించకూడదని తెలిపింది. పిటిషన్లపై విచారణకు నిరాకరించింది. వారి పిటిషన్లు అప్పీలేట్ ట్రిబ్యునళ్ల ముందు విచారణలో ఉన్నాయని పేర్కొన్నది. ఈ దేశంలో ఓటు హక్కు రాజ్యాంగపరమైనది మాత్రమే కాదని, అదొక భావోద్వేగపూరితమైనదని తెలిపింది. కాలపరిమితి విధించి ట్రిబ్యునళ్లపై భారం మోపలేమని వివరించింది.
వివిధ రాష్ర్టాల్లో ఓటరు జాబితా సవరణలో ఎలాంటి ఆరోపణలు వచ్చాయో చూశాం. మరి మన రాష్ట్రంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఓటర్లే పాలకులను ఎన్నుకునే నిర్ణేతలు. మరి అంతటి కీలకమైన ఓటరు జాబితా గందరగోళంగా ఉండటం సరికాదు. అనర్హులను తొలగించడం, అర్హులను చేర్చడం మంచి పనే. కానీ ఆ ముసుగులో కొందరి రాజకీయ ఆకాంక్షల కోసం అధికారులు పని చేస్తే ఓటరు జాబితా అస్తవ్యస్తమవుతుంది.
ఆ ఓటర్లే రేప్పొద్దున పాలకులను ఎన్నుకుంటారు. కాబట్టి ఓటరు జాబితా తయారీ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. త్వరలో తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు షెడ్యూల్ విడుదల కానున్నది. కాబట్టి తెలంగాణలోని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పౌర సమాజం ప్రతినిధులు, ఓటర్లు, రాజకీయ పార్టీల ఏజెంట్లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరమున్నది. ఓటరు జాబితా అంటే మన భవిష్యత్తు నిర్ణేతల ఎంపికకు మూలం.
– ఎడిటోరియల్ డెస్క్