‘బుద్ధిమంతుడని సద్ది కడితే బొడ్రాయి కాడ భోంచేసిండట’. ఇది తెలంగాణలో ఒక సామెత. ఆ బుద్ధిమంతుల గురించే నాలుగు మాటలు. చట్టం, నైతికత.. ఈ రెండింటినీ అన్ని సందర్భాల్లో ముడిపెట్టి చూడలేం. కొన్ని విషయాలు ఆత్మసాక్షికి సంబంధించినవై ఉంటాయి. మరికొన్ని చట్టబద్ధంగా ముందుకు సాగాల్సినవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సందర్భం ఏదైనా చట్టం, నైతికత నిత్యం జనంలో చర్చలో ఉంటాయి.
1990కి పూర్వం కాంగ్రెస్ పార్టీనే అటు హస్తిన, ఇటు దాదాపు అన్ని రాష్ర్టాల్లోనూ అధికారంలో ఉన్నది. అప్పటికే చట్టం గురించిన చర్చ, ఏకపక్ష పోకడలంటూ మీడియా కథనాలు రాసింది. విపక్షాలు నాటి ఇందిరాగాంధీ నుంచి పీవీ నరసింహారావు వరకు పార్టీ ఫిరాయింపులు, ముడుపులు అంటూ తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. నాడు మీడియా ప్రభావం, రాజకీయాల్లో ఉన్న విలువలు, నైతికాంశాలు కొంతవరకు పనిచేశాయి. అందుకే మితిమీరి అదేపనిగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సందర్భాలు తక్కువ. రాష్ర్టాల రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారనే విమర్శలు సైతం లేకపోలేదు.
2009 తర్వాత నుంచి దేశ రాజకీయాల్లోనే మార్పు వచ్చింది. ఎప్పుడు ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎంపీలు ఫిరాయిస్తారో తెలియదు. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయిస్తారో తెలియదు. ఆ ఫిరాయింపులు కూడా కొన్ని సందర్భాల్లో చట్టబద్ధంగానే ఉంటాయి. రెండింట మూడోవంతు నంబర్ ఉండేలా ఫిరాయింపులు ఉంటాయి. ఇక ఓట్లేసిన ప్రజలు నుంచి ఎదురయ్యే నైతికసూత్రాలే నిలబడి ఫిరాయించిన వారిని ప్రశ్నిస్తున్నాయి.
వరుస ఫిరాయింపుల నేపథ్యంలోనే రెండు చట్టాలు, ఓ చారిత్రక సందర్భం గుర్తుచేసుకోవాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం (1951), పార్టీ ఫిరాయింపుల చట్టం (1985)తో పాటు అనేక విషయాలను గమనంలోకి తీసుకోవాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం గురించి, ఎన్నికలు జరుగుతున్న తీరుతెన్నుల గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఓటర్లను ఎట్లా ప్రలోభపెడుతున్నారు? ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నారనే విషయాలు బహిరంగమే. ఇక ఫిరాయింపుల విషయానికొస్తే..గడిచిన పదేండ్ల కాలంలో డజనుకు పైగా రాష్ర్టాల్లో ప్రభుత్వాలు తారుమారయ్యాయి. కొన్ని పార్టీలు ఉనికినే కోల్పోయాయి.
అందులో ప్రాంతీయ పార్టీల సంఖ్యే ఎక్కువ. మహారాష్ట్ర, గోవా, ఈశాన్య రాష్ర్టాల రాజకీయ పరిణామాలు వీటికి అదనం. బ్రిటిష్ పార్లమెంటరీ నమూనా ఆధారంగానే రాజ్యసభ ఏర్పడింది. స్వతంత్ర భారతదేశంలో మన పౌరులకిచ్చిన హామీలను నెరవేర్చాలని, వారికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత మన నాయకులపై, పార్టీలపై మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఉండటం లేదు? దీనికి కారణం ఏమిటి? ఎవరిని నిందించాలి? ఎవరిని దీనికి బాధ్యులను చేయాలి? ఇవే నేటితరంలోనూ తీవ్రంగా ఆలోచించేలా చేస్తున్న పరిణామాలు.
రాజకీయ పార్టీలు పెద్దల సభలకు పెద్దలనే పంపిస్తున్నాయా? లేకపోతే రాజకీయ పరిణామాలు, అన్నిరకాల కోణాలను ఆధారంగా చేసుకుని పంపిస్తున్నాయా? అంటే రాజకీయం తప్ప మరోటి లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పెద్దపెద్ద వ్యాపారవేత్తలు, సినీతారలు, క్రీడాకారులు పెద్దల సభలోకి అడుగుపెడుతున్నారు. వారేమీ మాట్లాడరు. బిల్లుల సందర్భంలో ఓటేయడానికి వస్తారు, పోతారు తప్ప దేశ ప్రజల గురించి, వారి భవిష్యత్తు గురించిన స్పృహ ఇసుమంతైనా లేదనేది పలువురి వాదన. నిండా నలభై యేండ్లు కూడా నిండనివారు పెద్దల సభకు వెళ్తున్నారు.
వీరంతా ఆయా రాష్ర్టాల, కేంద్రపాలిత ప్రాంతాల హక్కులను రక్షించేలా మాట్లాడతారా? ఈ సువిశాల భారతదేశ ఆత్మను అర్థం చేసుకుంటారా? ఇలాంటి విషయాలన్నీ సమాజం గురించి ఆలోచించే వారిని కలవర పెడుతున్నాయి. పార్టీ ఫిరాయింపులు జరుగుతున్న సందర్భంలో రాజకీయాల్లో విలువల గురించి పెద్దల సభ నుంచి ఎవరైనా ఏమి మాట్లాడగలరు? ఇదంతా ఓ ఆటలా మార్చేస్తున్నారు. తాము అనుకున్న బిల్లులు పాస్ కావాలంటే దానికి కావాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలతో పనిచేయించుకునేందుకే మొగ్గుచూపుతున్నారు.
గతంలో 123 అగ్రిమెంట్ సందర్భంలో దేశభవిష్యత్తుకు భంగకరమైన అంశాన్ని తాము ఒప్పుకోబోమని నాటి వామపక్షాలు తేల్చిచెప్పాయి. ప్రభుత్వానికి బయటినుంచి మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించాయి. తాజాగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (మహిళా బిల్లు) ప్రత్యేక మెజారిటీ లేకపోవటం వల్ల వీగిపోయిన విషయం తెలిసిందే. 298 ఓట్ల సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ రెండింట మూడొంతుల మెజారిటీ లేకపోవడంతో లోక్‌సభలోనే మహిళా బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా వీగిపోయింది. ఇలాంటి సందర్భాల్లోనే ఓటమిని జీర్ణించుకోలేని అధికార పక్షాలు ఫిరాయింపులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తూ అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఒక్కోసారి లోక్‌సభలో పాసైన బిల్లు రాజ్యసభలో వీగిపోవడం చూస్తుంటాం. అందుకే ఉభయసభల్లో తమ మెజారిటీని పెంచుకోవటానికి ఏకంగా ఆయా పార్టీల నుంచి ఎంపికైన అందర్నీ గంపగుత్తగా తమ పార్టీలోకి ఆహ్వానించి ఇది ఫిరాయింపు కిందికి రాదని బాజాప్త చెప్తున్నారు. వాస్తవానికి లోక్‌సభలో నుచి ఏదైనా బిల్లు పాసై వస్తే రాజ్యసభలో దానిపై నిర్ణయాత్మక చర్చ జరగాలి. దేశ ప్రజలకు దాని లోతుపాతులు పెద్దలు తెలియజేయాలి. ఇప్పుడు అలాంటి విషయాలకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారు. లోక్‌సభలో పాసైన బిల్లులు పెద్దగా చర్చ జరుపకుండానే రాజ్యసభలో పాసైన సందర్భాలూ లేకపోలేదు.
ప్రాంతీయ పార్టీల నుంచి చట్టసభల్లోకి వెళ్తున్న వారిని కాపాడుకోవటం ఎలా? ఇదో పెద్ద సమస్యగా పరిణమించే ప్రమాదం ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. అటునుంచి పక్క రాష్ర్టాలకు విస్తరించింది. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా తనదైన రాజకీయాలు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది. ఈ సందర్భంలోనే ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్‌పై మద్యం కేసు నమోదైంది. కానీ తాజాగా దానిని కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు మూకుమ్మడిగా ఫిరాయించారు. దీంతో పెద్దల సభలో బీజేపీ బలం 113కి చేరింది. అత్యున్నత సభకు నామినేట్ అయిన రాజ్యసభ సభ్యులు కూడా ఇలా ఫిరాయింపులకు పాల్పడితే ఏమనుకోవాలి? విలువలతో కూడిన రాజకీయాలనే జనం హర్షిస్తారు.
– అస్కాని మారుతీసాగర్ 90107 56666