BRS | బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ నేత దోసల అనిల్ రెడ్డికి గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చోవడం లేదని అన్నారు.
కేటీఆర్ నాయకత్వంలో గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు గెలిచామని మాధవరం గుర్తుచేశారు. బీఆర్ఎస్ సింగిల్‌గా జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని స్వాధీనం చేసుకుందని తెలిపారు. కార్యకర్తలు, ప్రజలను కాపాడుకున్నవాడే నాయకుడు అవుతాడని అన్నారు.