ముంబై, జనవరి 12: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు ఎట్టకేలకు బ్రేక్‌పడింది. వరుసగా ఐదు రోజులుగా నష్టపోయిన సూచీలు లాభాల్లోకి రాగలిగాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలకు మధ్యాహ్నం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. ఎనర్జీ, బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది. అమెరికా-భారత్ దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్టు వచ్చిన వార్తలు సూచీల లాభాలకు ప్రధాన కారణం. ప్రపంచ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం, విదేశీ నిధులు తరలిపోవడంతో ప్రారంభంలో 700 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 301.93 పాయింట్లు లాభపడి 83,878.17 వద్ద నిలిచింది.
మరో సూచీ నిఫ్టీ 106.95 పాయింట్లు ఎగబాకి 25,790.25 వద్ద స్థిరపడింది. సూచీల్లో టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, ఎస్బీఐ, హెచ్‌యూఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, లార్సెన్ అండ్ టుబ్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు నష్టపోయాయి. రంగాలవారీగా మెటల్ సూచీ 1.92 శాతం లాభపడగా, కమోడిటీస్, ఎనర్జీ, పీఎస్‌యూ బ్యాంక్‌లు, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఎఫ్ఎంసీజీ రంగ సూచీలకు మదుపరుల నుంచి మద్దతు లభించగా..కానీ, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, టెలికాం, పవర్ రంగ సూచీలు నష్టపోయాయి. గత ఐదు రోజుల్లో సెన్సెక్స్ 2,185.77 పాయింట్లు లేదా 2.54 శాతం, నిఫ్టీ 645.25 పాయింట్లు లేదా 2.45 శాతం చొప్పున పతనం చెందాయి.
ఈ నెల 15న స్టాక్ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి. మహారాష్ట్రలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కారణంగా ఈ గురువారం బీఎస్ఈతోపాటు ఎన్ఎస్ఈలు పనిచేయవు. దీంతో ఈవారం ట్రేడింగ్ నాలుగు రోజులకు పరిమితమైంది. ఈక్విటీలతోపాటు డెరివేటివ్, కమోడిటీస్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్లు కూడా సెలవు పాటించనున్నాయి.