ముంబై, అక్టోబర్ 29: కొద్దివారాలపాటు వరుస ర్యాలీలతో అదరగొట్టిన భారత స్టాక్ మార్కెట్ ఇప్పుడు పతనబాట పట్టింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాల తాకిడికి వరుసగా మూడో రోజైన శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 678 పాయింట్లు పడిపోయి, 59,307 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 186 పాయింట్లు పతనమై 17,672 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టెక్ మహీంద్రా 3.5 శాతం తగ్గింది. ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1-3 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్, మారుతి, టాటా స్టీల్, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 2.6 శాతం వరకూ లాభపడ్డాయి. కాగా ఈ వారంలో సెన్సెక్స్ మొత్తం 1,515 పాయింట్లు తగ్గగా, నిఫ్టీ 443 పాయింట్లు నష్టపోయింది. అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు రూ. 20,000 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు. ఒక్క ఈ వారంలోనే విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు రూ. 10,000 కోట్లను మించాయి.
వరుసగా మూడు రోజుల పాటు మార్కెట్లో జరిగిన అమ్మకాలతో ఇన్వెస్టర్లు రూ. 6.15 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ. 2,59,20,458 కోట్లకు తగ్గింది.