న్యూఢిల్లీ: రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను తొలగించాలంటూ దాఖలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారించిన సుప్రీంకోర్టు పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషలిస్ట్, సెక్యులర్ పదాలు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని కోర్టులు ఇప్పటికే పలు తీర్పుల్లో నొక్కి చెప్పాయని పేర్కొంది. ఈ రెండు పదాలను రాజ్యాంగ పీఠిక నుంచి తొలగించాలంటూ బీజేపీ నేత, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సహా పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలను జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్, అడ్వకేట్ అయిన విష్ణుశంకర్‌జైన్ తన వాదనలు వినిపిస్తూ 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణపై పార్లమెంటులో అసలు చర్చే జరగలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జస్టిస్ ఖన్నా.. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించడమేనని, దాని భావన సమానత్వమేనని స్పష్టం చేశారు. దీనిని పాశ్చాత్య ధోరణిలో చూస్తే వేరే అర్థం వస్తుందని పేర్కొన్నారు. సెక్యులరిజం అనే పదం కూడా అంతేనని నొక్కి చెప్పారు. మరో న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ్ తన వాదనలు వినిపిస్తూ ఇందిరాగాంధీ ప్రభుత్వం అత్యయిక స్థితి విధించిన సమయంలో ఈ సవరణ ప్రభావితమైందని చెప్పారు. లాయర్ల వాదనలకు జస్టిస్ ఖన్నా స్పందిస్తూ.. ‘భారత్ లౌకిక దేశంగా ఉండాలనుకోవడం లేదా?’ అని ప్రశ్నించారు. సుబ్రమణ్యస్వామి కూడా తన వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.