గజ్వేల్, ఆగస్టు 26: గ్రామాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పత్యేకాధికారుల పర్యవేక్షణ లోపించడంతో పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. మురుగు, దుర్గంధంతో ప్రజలు జబ్బుల బారినపడుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో గడిచిన రెండు నెలల కాలంలో సీజనల్ వ్యాధులతో వందలాది మంది ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో చేరి చికిత్సలు తీసుకున్నారు.
వారం క్రితం జగదేవ్‌పూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్, అనంతసాగర్ గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఒకరు ఇద్దరు చొప్పున విషజ్వరాల బారినపడ్డారు. ఐదు రోజుల వ్యవధిలోనే డెంగీతో తిమ్మాపూర్‌లో ఇద్దరు మృతిచెందడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఉత్తమ పంచాయతీగా గుర్తింపు పొందిన తిమ్మాపూర్‌లో నేడు పారిశుధ్యం లోపించడంతో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గ్రామానికి చెందిన కొంతం మహేశ్(33), ఇంటర్ విద్యార్థి నాయిని శ్రవణ్‌కుమార్(15) డెంగీతో మృతిచెందారు. ఇద్దరు మృతి తర్వాత తిమ్మాపూర్‌లో వైద్యాధికారులు వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.
600మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించి రక్త పరీక్షలు చేశారు. గ్రామానికి చెందిన మరో పది మందికి పైగా డెంగీ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో గ్రామస్తులు భయపడుతున్నారు. చాలామంది గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతుండగా, మరికొంత మంది ప్రైవేటు దవాఖానలో చేరారు. ఒకరిద్దరు మాత్రం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు వెళ్లారు. గ్రామంలో హెల్త్ క్యాంపు కొనసాగుతున్నా జ్వర పీడితుల సంఖ్యమాత్రం తగ్గడం లేదు. నాణ్యమైన వైద్యం అందించి మందులు పంపిణీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గజ్వేల్ మండలం అహ్మదీపూర్‌లో డెంగీతో ఆరుగురు గ్రామస్తులు బాధపడుతూ గజ్వేల్, హైదరాబాద్‌లోని ప్రైవేటు దవాఖానల్లో చేరారు. గత నెలలో మండలంలోని రిమ్మనగూడకు చెందిన 10 మంది విద్యార్థులు డెంగీతో దవాఖానల్లో చికిత్స తీసుకున్నారు. గ్రామాల్లో జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విషజ్వరాలు, డెంగీతో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నవారు అప్పుల పాలవుతున్నారు. జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన కొంతం మహేశ్ డెంగీతో ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి మృతిచెందాడు. ఇతనికి దవాఖానలో చికిత్స కోసం రూ.9లక్షల ఖర్చు అయినట్లు కుటుంబీకులు తెలిపారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో పాటు భారీగా అప్పులు కావడంతో ఆ కుటుంబంలో చెప్పలేని బాధ నెలకొంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ష్షాకాలంలో వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపెట్టి పారిశుధ్య లోపించకుండా చర్యలు తీసుకున్నారు.మురుగుకాల్వలు శుభ్రం చేయడం, వీధుల్లో చెత్తను తొలిగించడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. ప్రత్యేకాధికారుల పాలనలో నిధుల లేమితో ఎలాంటి పనులు చేపట్టలేకపోతున్నారు. అంతేకాకుండా ప్రత్యేకాధికారులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి పారిశుధ్య పనులు చేపట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. వారు సొంత డబ్బులు ఖర్చుచేసి పనులు చేయించి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో గ్రామ పాలన అస్తవ్యస్తంగా మారి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.