హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని బడులు బుధవారం నుంచి పునఃప్రారంభంకానున్నాయి. 2024 -25 నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానుండగా, సర్కారు బడులు సమస్యలతో విద్యార్థులను స్వాగతించనున్నాయి. ముఖ్యం గా బడులను ఊడ్చేవారు.. కడిగేవారు కరువయ్యారు. దీంతో పారిశుద్ధ్యం ప్రశ్నార్థకంగా మారింది. సర్కారు బడుల్లో స్కావెంజర్లను నియమిస్తామని సీఎం రేవంత్రెడ్డి గతంలో హామీనిచ్చారు. కానీ, ఈ హామీ కార్యరూపందాల్చలేదు. దీంతో టీచర్లు స్థానికంగా ఉన్నవారికి పురమాయించి ఊడ్చడం, కడిగించడం చేయించాల్సి వచ్చింది. పాఠశాలల్లో వసతులు కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో మరమ్మతులను సర్కారు మహిళా సంఘాలకు అప్పగించింది. కలెక్టర్ల ద్వారా దాదాపు వెయ్యికోట్లకు వరకు నిధులను కేటాయించింది. బడుల్లో పనులింకా పూర్తికాలేదు.
రాష్ట్రంలో సొంత భవనాలు లేని బడులు 696 ఉన్నాయి. వీటిలో 239 అద్దెభవనా ల్లో నడుస్తున్నాయి. మరో 264 బడులను అద్దె లేకుండా నడిపిస్తున్నారు. మరో 34 పాఠశాలలు ఇతర శాఖలకు చెందిన భవనాల్లో నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో పోస్టులకు తగ్గట్టు టీచర్లు లేరు. మొత్తం 1. 25 లక్షల టీచర్ పోస్టులుండగా, తాజా గణాంకాల ప్రకారం 21వేల పైచిలుకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత మార్చి నుంచి రాష్ట్రంలో టీచర్ల రిటైర్మెంట్లు ప్రారంభమయ్యాయి. దీంతో ఖాళీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. 11వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను జారీచేసింది. ఈ పోస్టులు భర్తీకి మరో మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నది. టీచర్ల కొరత సమస్యను తీర్చేందుకు విద్యావలంటీర్లను నియమించాల్సి ఉండగా, విద్యావలంటీర్లను తీసుకోబోమని ఇటీవలే విద్యాశాఖ ప్రకటించింది. పలు పాఠశాలల్లో బోధనేతర పోస్టులు కూడా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. 26వేల బడులకు 4,164 మంది బోధనేతర సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. అటెండర్ల సంఖ్య కేవలం 2,036 మాత్రమే.
రాష్ట్రంలో జీరో విద్యార్థులున్న బడులు 1,739 ఉండగా, 1 నుంచి 10 మంది విద్యార్థులున్న బడులు 2,229 ఉన్నాయి. ఇక నమోదు పెంచేందుకు ఏటా నిర్వహించే బడిబాటను ప్రభుత్వం ఈ సారి ప్రారంభించింది. అటు బడిబాటను నిర్వహిస్తుండగానే మరో వైపు బదిలీలకు తెరలేపింది. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ షురూ కాగా టీచర్లంతా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. దీంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. దీని ప్రభావం పిల్లల నమోదుపై పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.