ముంబై : ఆన్లైన్ స్కామ్‌లతో సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతున్నారు. అదనపు ఆదాయం కోసం పార్ట్‌టైమ్ జాబ్ అన్వేషిస్తున్న వ్యక్తిని ఓ మహిళ ఉద్యోగం పేరుతో బురిడీ కొట్టించి రూ. 3.42 లక్షలను స్వాహా చేసింది. ముంబైకి చెందిన 33 ఏండ్ల వ్యక్తి ఫేస్బుక్లో జాబ్ ఆఫర్ చూసి కాంటాక్ట్ చేయడంతో స్కామర్ అతడిని మోసగించింది. లింక్‌పై క్లిక్ చేయడంతో మేరీ అనే మహిళ వాట్సాప్ నెంబర్ కనిపించింది. బాధితుడు ఆమెకు కాల్ చేయగా తాను అమెజాన్‌లో హైరింగ్ ఆఫీసర్నని నమ్మబలికింది. అభ్యర్ధులు కంపెనీ ఆన్లైన్ వేదికగా పలు టాస్క్‌లు పూర్తిచేయాల్సి ఉంటుందని బాధితుడితో ఆమె వెల్లడించింది.
ఆపై పార్ట్‌టైం జాబ్ చేసేందుకు బాధితుడు ఆసక్తి కనబరచడంతో హైరింగ్ మేనేజర్ అతడికి ఓ లింక్ పంపి అకౌంట్ క్రియేట్ చేసుకుని పని ప్రారంభించాలని కోరింది.అకౌంట్ క్రియేట్ చేయగానే బాధితుడికి వెంటనే రూ. 80 లభించాయి. ఆపై రూ. 200 రీచార్జ్ చేసుకుని ప్రోడక్ట్‌ను కొనుగోలు చేయాలని బాధితుడికి సూచించారు. టాస్క్ పూర్తయిన అనంతరం బాధితుడి ఈ వ్యాలెట్ ఖాతాలో రూ. 450 క్రెడిట్ అయ్యాయి. దీంతో బాధితుడి విశ్వాసం చూరగొన్న స్కామర్ ఆపై వంచనకు తెరలేపింది. ఇక టాస్క్‌లను పూర్తి చేసేందుకు ప్రోడక్ట్లను కొనడం, రీచార్జ్ చేయడంతో రూ. 2.5 లక్షలు ఖర్చయ్యాయి.
ఈ మొత్తానికి గాను అతడి ఈవ్యాలెట్ ఖాతాలో రూ. 5.13 లక్షలు డిపాజిట్ అయ్యాయి. ఈ మొత్తాన్ని బాధితుడు తన బ్యాంక్ ఖాతాకు మళ్లించేందుకు ప్రయత్నించగా ఎర్రర్ మెసేజ్ వచ్చింది. బాధితుడు ఈ విషయం హైరింగ్ మేనేజర్‌కు తెలపగా సొమ్మును విత్‌డ్రా చేసేందుకు 20 శాతం పన్ను చెల్లించాలని ఆమె నమ్మబలికింది. పన్ను చెల్లించేందుకు బాధితుడి వద్ద నగదు లేకపోవడంతో బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి ఆ డబ్బుతో రూ. లక్షకు పైగా పన్ను చెల్లించాడు. భారీ మొత్తంలో పన్ను చెల్లించినా బాధితుడు తన బ్యాంక్ ఖాతాకు సొమ్మును ట్రాన్స్ఫర్ చేయలేకపోవడంతో పాటు తన ఖాతా డీయాక్టివేట్ కావడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More