కురవి, జూలై 07 : నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు నాట్లు వేసుకునే సమయంలో రైతుబంధు ఇచ్చి ఆదుకుంటే..ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లను దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా నిధులను వేసిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. 18 నెలలుగా మాటలకే పరిమితమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కురవి మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో మోకాలి శస్త్ర చికిత్స అనంతరం సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజలు అసమర్థ ముఖ్యమంత్రిని, పాలనపై పట్టులేని మంత్రులను, వారి మాటలను పట్టించుకోవడం మానేసారన్నారు.
ప్రజలను మాటలతో మోసం చేస్తున్న పాలకులకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులు ఒక్క అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ సగం మందికి కూడా చేయలేదని, రైతు బంధు ఎగ్గొట్టారని ఆరోపించారు. కేసీఆర్ రైతులకు రెండు పంటలకు టంచనుగా రైతు బంధు జమచేశారని గుర్తు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏడాదిన్నర కాలంలో ఎంతమందికి రైతు బంధు జమచేశారని, వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మహబూబాద్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై మంత్రి, ఎమ్మెల్యేలు సమీక్ష చేయడంలేదన్నారు.
మహబూబాబాద్ జిల్లా అనాథగా మారిందని, పట్టించుకున్న నాధుడే కరువయ్యారని విమర్శించారు. 3500 మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని గొప్పలు చెబుతున్నారని, కురవి మండలంలో మోడల్ గ్రామంగా ఎంపికైన కొత్తూరు (జీ) గ్రామంలో ఎంతమందికి అర్హులకు ఇచ్చారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతికి తెరలేపారన్నారు. సాగునీటి కోసం బీఆర్ఎస్ మరో యుద్ధం చేయనుందని, మరోవారం రోజుల పాటు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చామని అన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి కదం తొక్కుతారన్నారు. అలాగే కేసీఆర్కు ఆయురారోగ్యాలు ప్రసాదించమని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, నూతక్కి నర్సింహారావు, గుగులోతు రవి నాయక్, గుగులోత్ పద్మ, బోడ శ్రీను, అల్లూరి కిషోర్ వర్మ, బాదె నాగయ్య, యానాల గంగాధర్ రెడ్డి, కిన్నెర మల్లయ్య, బిక్షం రెడ్డి, చిన్నం భాస్కర్, దిడ్డి శ్రీను, బోజ్యా నాయక్, రాజు నాయక్, గుండెబోయిన సూరయ్య, కళ్లెపు శ్రీను, అర్జున్ చౌహాన్, రవి, తదితరులు పాల్గొన్నారు.