మాగనూరు : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) పేరుతో అడ్డగోలుగా ఇసుక దోపిడీ కొనసాగుతుందని మాగనూరు( Maganur), కృష్ణ, మక్తల్( Maktal) మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలలుగా ఇందిరమ్మ ఇళ్లకు ఒక్కో ఇంటికి 8 ట్రాక్టర్ల చొప్పున ఇసుకకు పర్మిషన్ ఇస్తున్నారు. పర్మిషన్ ఒక ట్రాక్టర్కు తీసుకొని అదనంగా మూడు, నాలుగు ట్రాక్టర్లు నడిపించుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇసుక అనుమతులపై పోలీస్, రెవెన్యూ శాఖ చూడనట్టు వ్యవహరించడంతో ఇసుకాసురులు అడ్డగోలుగా ఇసుక దోపిడీ కొనసాగిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్కు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు దండుకుంటున్నారు. పంచాయతీ కార్యదర్శులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న వారికే కాకుండా డబ్బులిచ్చిన వారికి యధేచ్చగా ఇసుకకు అనుమతులు ఇవ్వడంతో రైల్వే స్టేషన్ , తదితర స్థలాల్లో డంపులు వేసి రాత్రి వేళలో టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే : తహసీల్దార్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి గ్రామాల్లో ఇసుక తరలింపు వ్యవహార బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులదేనని తహసీల్దార్ సురేష్కుమార్ తెలిపారు. కార్యదర్శుల సమాచారం మేరకే ఇసుక ట్రాక్టర్లకు పర్మిషన్ ఇస్తున్నామని స్పష్టం చేశారు.