Sai Sudharshan | వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడిన టీమిండియా యువ క్రికెటర్ సాయి సుదర్శన్ ఆరోగ్యంపై బీసీసీఐ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సుదర్శన్ గాయం తీవ్రమైనది కాదని బోర్డు స్పష్టం చేసింది. రెండో రోజు విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ కొట్టిన బంతిని అద్భుతమైన ఫీల్డింగ్‌తో క్యాచ్ పట్టుకొని పెవిలియన్ బాట పట్టించాడు సాయి సుదర్శన్. అయితే ఆ సమయంలో చేతికి బలమైన దెబ్బ తగిలింది. దాంతో బాధను తట్టుకోలేక మైదానాన్ని వదిలి వెళ్లిన సాయి స్థానంలో దేవదూత్ పడిక్కల్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ఆడారు. అయితే అప్పటి నుండి సాయి సుదర్శన్ గాయంపై అభిమానులు ఆందోళన చెందుతూనే ఉన్నారు.
ఈ క్రమంలో సాయి సుదర్శన్ గాయం గురించి స్పందించిన బీసీసీఐ ..“అతడి గాయం తీవ్రమైనది కాదు. ప్రస్తుతం బాగానే ఉన్నాడు. మా మెడికల్ టీమ్ అతడి ఆరోగ్య పరిస్థితిని నిత్యం పర్యవేక్షిస్తోంది. అవసరమైన చికిత్స అందిస్తున్నారు,” అని ప్రకటనలో పేర్కొంది. ఈ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ 87 పరుగులు చేసి టీమిండియాకు మంచి ఆరంభాన్ని అందించాడు. అయితే, వైస్ కెప్టెన్ జోమెల్ వారికన్ వేసిన బంతికి బ్యాక్‌ఫుట్ షాట్ ప్రయత్నించి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఇదిలా ఉంటే, విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ కష్టాల్లో పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి 9 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. భారత్ స్కోరు సమం చేయాలంటే ఇంకా 293 పరుగులు చేయాల్సి ఉంది.
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. పసలేని విండీస్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారించింది అచ్చొచ్చిన అరుణ్‌జైట్లీ స్టేడియంలో టీమ్ఇండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్(175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(196 బంతుల్లో 129 నాటౌట్, 16ఫోర్లు, 2సిక్స్‌లు) సెంచరీలతో భారత్ భారీ స్కోరు అందుకుంది. ఇక బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్ అంతగా ప్రభావం చూపని వేళ స్పిన్ ద్వయం జడేజా, కుల్దీప్ యాదవ్‌తో విండీస్‌పై అటాకింగ్ చేశాడు. ఓ ఎండ్‌లో కుల్దీప్ కట్టడి చేస్తే..తన లెఫార్ట్ స్పిన్‌తో జడేజా విండీస్ పతనంలో కీలకమయ్యాడు.