న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. పసలేని విండీస్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారిస్తున్నది. అచ్చొచ్చిన అరుణ్‌జైట్లీ స్టేడియంలో టీమ్ఇండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్(175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(196 బంతుల్లో 129 నాటౌట్, 16ఫోర్లు, 2సిక్స్‌లు) సెంచరీలతో భారత్ భారీ స్కోరు అందుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 318/2 రెండో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన టీమ్ఇండియా జైస్వాల్, గిల్ సెంచరీలతో 518/5 వద్ద డిక్లేర్ చేసింది.
నితీశ్‌కుమార్‌రెడ్డి(43), ధృవ్ జురెల్(44) రాణించారు. జోమెల్ వారికన్(3/98) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్..ఆట ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. షాయ్ హోప్(31), టెవిన్ ఇమ్లాచ్(14) క్రీజులో ఉన్నారు. రవీంద్ర జడేజా(3/37) మూడు వికెట్లతో విండీస్ పతనంలో కీలకమయ్యాడు. చేతిలో ఆరు వికెట్లు ఉన్న విండీస్ ప్రస్తుతం 378 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది. నానాటికీ దిగజారుతున్న తమ జట్టు వైఫల్య ప్రదర్శనను విండీస్ క్రికెట్ దిగ్గజాలు వీవీయన్ రిచర్డ్స్, బ్రియాన్ లారా స్టాండ్స్ నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు.
టెస్టుల్లో టీమ్ఇండియా కెప్టెన్ గిల్ సెంచరీల మోత మోగుతున్నది. ఇటీవల ఇంగ్లండ్ సిరీస్ ఫామ్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తూ గిల్..విండీస్‌తో రెండో టెస్టులోనూ రెచ్చిపోయాడు. ఢిల్లీ పిచ్‌పై విండీస్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. జైస్వాల్‌తో కలిసి రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన గిల్ ఆది నుంచే విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన సహజశైలికి అనుగుణంగా పేసర్లు, స్పిన్నర్ల అన్న లెక్కలేకుండా బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న క్రమంలో లేని పరుగు కోసం ప్రయత్నించిన జైస్వాల్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించి రనౌట్‌గా వెనుదిరిగాడు. డబుల్ సెంచరీ ఖాయమనుకుంటున్న తరుణంలో గిల్‌తో ఏర్పడిన సమన్వయ లోపంతో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.
బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన నితీశ్‌కుమార్‌రెడ్డి గిల్‌తో కలిసి విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఓ ఎండ్‌లో గిల్ బౌండరీలు బాదితే మరో ఎండ్‌లో నితీశ్ చక్కని సహకారం అందించాడు. విండీస్ కెప్టెన్ రోస్టన్ చేస్ ఆఫ్‌సైడ్ ఫీల్డర్లను మోహరించినా ఏ మాత్రం లెక్కచేయకుండా గిల్ ఆన్‌సైడ్ ఫ్లిక్ షాట్లతో స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశాడు. జేడన్ సీల్స్ బౌలింగ్‌లో మిడిల్ అండ్ లెగ్‌లో పడిన బంతిని అంతే నేర్పుగా గిల్ కొట్టిన షాట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. జస్టిన్ గ్రీవ్స్ పసలేని బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ గిల్ ముందుకొచ్చి బౌండరీలతో రెచ్చిపోయాడు. ఇలా బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా చేస్‌కు అనుకున్న ఫలితం దక్కలేదు. ఒక దశలో ఆఫ్‌సైడ్ ఏడుగురిని, ఆన్‌సైడ్ ఇద్దరిని మోహరించిన చేస్..గిల్ దూకుడును ఏ మాత్రం ఆపలేకపోయాడు.
ఈ క్రమంలో టెస్టుల్లో తన 10వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. వారికన్ బౌలింగ్‌లో నితీశ్ ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన ధృవ్ జురెల్…గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌కు మరింత దూకుడు తీసుకొచ్చాడు. అప్పటికే అలసిపోయిన విండీస్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ ఇద్దరు బౌండరీలతో చెలరేగడంతో పరుగుల రాక సులువైంది. లంచ్ సమయానికి 427/4తో ఉన్న టీమ్ఇండియా ఆ తర్వాత గిల్, జురెల్ బ్యాటింగ్ జోరుతో టాప్‌గేర్‌లో దూసుకెళ్లింది. వీరిద్దరి బ్యాటింగ్ ధాటికి విండీస్ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. లంచ్ తర్వాత మరో గంటన్నర సమయం ఉన్నప్పుడు భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
పిచ్‌పై అప్పటికే ఓ అంచనాకు వచ్చిన కెప్టెన్ గిల్..జడేజాను తొందరగానే తీసుకురావడం కలిసొచ్చింది. బుమ్రా, సిరాజ్ అంతగా ప్రభావం చూపని వేళ స్పిన్ ద్వయం జడేజా, కుల్దీప్ యాదవ్‌తో విండీస్‌పై అటాకింగ్ చేశాడు. ఓ ఎండ్‌లో కుల్దీప్ కట్టడి చేస్తే..తన లెఫార్ట్ స్పిన్‌తో జడేజా విండీస్ పతనంలో కీలకమయ్యాడు. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్(10)తొలి వికెట్‌గా వెనుదిరుగగా, రెండో వికెట్‌కు తేజ్‌నారాయణ్ చంద్రపాల్(34), అలిక్ అతనజె(41) క్రీజులో నిలదొక్కుకున్నారు. జడేజా బౌలింగ్‌లో స్లిప్‌లో రాహుల్ క్యాచ్‌తో చంద్రపాల్ ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత అతనజె కూడా అతన్ని అనుసరించగా, కెప్టెన్ చేస్(0) పరుగుల ఖాతా తెరువలేకపోయాడు. షాయి హోప్, టెవిన్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 518/5 డిక్లేర్డ్(జైస్వాల్ 175, గిల్ 129 నాటౌట్, వారికన్ 3/98, చేస్ 1/83),
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 140/4(అతనజె 41, చంద్రపాల్ 34, జడేజా 3/37, కుల్దీప్ 1/45)