Sai pallavi interview | ‘అవార్డుల గురించి నేను ఎప్పుడూ తాపత్రయపడను. నన్ను నమ్మి కొత్త పాత్రలను సృష్టిస్తున్న దర్శకులను, నాపై ఉన్న నమ్మకంతో థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకులను మెప్పించడమే పెద్ద పురస్కారంగా భావిస్తుంటా’ అని తెలిపింది సాయిపల్లవి. సహజత్వంతో కూడిన విభిన్నమైన పాత్రలతో కథానాయికగా ప్రతిభను చాటుకుంటున్నదామె. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్ ( Shyam singharoy )’. నాని హీరోగా నటించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. ఈ నెల 24న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో సాయిపల్లవి పాత్రికేయులతో పంచుకున్న సంగతులివి…
దేవదాసీ పాత్రకు న్యాయం చేయడం చాలెంజింగ్‌గా అనిపించిందా?
దేవదాసీ వ్యవస్థ గురించి పాఠశాల రోజుల్లో చరిత్ర పుస్తకాల ద్వారా తెలుసుకున్నా. మనం చదువుకున్న అంశాలను వెండితెరపై ఆవిష్కరించే అవకాశం అరుదుగా లభిస్తుంది. దేవదాసీ పాత్ర గురించి దర్శకుడు చెప్పగానే నాలో ఆసక్తి మొదలైంది. కేవలం దేవదాసీల జీవితాల్ని పరిచయం చేయడమే కాకుండా లోతుగా వారి మనస్తత్వాల్ని చర్చిస్తూ కథ, పాత్రలను రాసిన విధానం నచ్చడంతో సినిమాను అంగీకరించా. ఓ పాత్ర తాలూకు ఎమోషన్స్‌తో కనెక్ట్ అయినప్పుడే దానికి తెరపై న్యాయం చేయగలుగుతాం. ఇందులో సాయిపల్లవి కాకుండా తెరపై దేవదాసి పాత్ర మాత్రమే కనిపిస్తుంది.
ఇందులోనూ డ్యాన్స్‌కు ఎక్కువగా ప్రాముఖ్యమున్న పాత్ర చేసినట్లుగా అనిపిస్తోంది?
నా కెరీర్ మొత్తంలో ‘లవ్‌స్టోరి’ సినిమాలో ఎక్కువగా డ్యాన్స్ చేశా. ఇందులో నృత్యాల కంటే ఎమోషన్స్‌కు ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఈ సినిమా కోసం క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా. ‘ప్రణవాలయ’ పాటలో నాతో పాటు నటించిన వారందరికి క్లాసికల్ డ్యాన్స్‌లో చాలా ప్రావీణ్యమున్నది. వారితో సమానంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నటించగలనా? లేదా?అని చాలా భయపడ్డా. నాకు డ్యాన్స్ రాదనే భయాలను పక్కనపెటి స్వేచ్ఛగా ఆ పాట చేశా.
దేవదాసి పాత్ర కోసం మీరు ఎలాంటి పరిశోధన చేశారు?
ఐదారు దశాబ్దాల క్రితం దేవదాసీలను దేవుడి సేవకులుగా అభివర్ణించేవారు. సమాజంలో వారికి గౌరవం ఉండేది. కాలానుగుణంగా సమాజంలో వారి స్థానం మారుతూ వచ్చింది. దేవదాసీలను చెడుభావనతో చూడటం మొదలుపెట్టారు. ఆ దురాచారాలపై శ్యామ్‌సింగరాయ్ అనే సాహితీవేత్త ఎలాంటి పోరాటం చేశాడన్నది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో నా లుక్, కాస్ట్యూమ్స్, హెయిర్‌ైస్టెల్ విభిన్నంగా ఉంటాయి.
సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్నారెందుకని?
ఓ కళారూపంలో కొనసాగుతూ అందులోనే ఆనందాన్ని వెతుక్కోవడమే నిజమైన అచీవ్‌మెంట్‌గా నేను భావిస్తాను. నాకు నటన, నృత్యాల్లో పెద్దగా ప్రావీణ్యంలేదు. అయినా నాకున్న కళతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నానంటే దేవుడిచ్చిన వరమని అనుకుంటున్నా. ప్రీ రిలీజ్ వేడుకలో ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు గుర్తురాగానే కన్నీళ్లు ఆగలేదు. సినిమాల్లోకి రాకపోయి ఉంటే నేను ఎన్నో గొప్ప అనుభూతులను, ఆనందాల్ని కోల్పోయేదాన్ని.
సినిమాలు కాకుండా మీకు ఏది అంటే ఇష్టం. కొత్తగా ఏదైనా తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారా?
స్వీయ విశ్లేషణ చేసుకోవడం నాకు ఇష్టం. నిరంతరం నన్ను నేను కొత్తగా పునర్నిర్వచించుకోవడానికి ప్రయత్నిస్తుంటా. డ్యాన్స్, సినిమాలు, మెడిసిన్ కాకుండా కొత్తగా మెడిటేషన్‌ను నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నా. నా గురించి నేను తెలుసుకోవడానికి ఇదొక కొత్త మార్గమని అనుకుంటున్నా.
మీరు నటించిన సినిమా విడుదలవుతుందంటే క్యారెక్టర్స్, నటనా పరంగా చాలా అంచనాలుంటాయి?వాటిని ఒత్తిడిగా భావిస్తుంటారా?
ప్రేక్షకురాలిగా నేను ఎలాంటి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తానో అలాంటి పాత్రల్లోనే నటించడానికి ఇష్టపడుతుంటా. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎంచుకున్న పాత్రల నుంచి నేను ఏదో ఒక ప్రయోజనం పొందాలని కోరుకుంటా. స్క్రీన్‌పై అలా కనిపించి వెళ్లిపోయే పాత్రలు చేయను.‘ఎమ్సీఏ’ సినిమా చేస్తున్న సమయంలో చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీలయ్యాను. షూటింగ్లో ఉండగానే అలాంటి పాత్రలు నాకు సరిపోవని అర్థమైంది. బలమైన ఎమోషన్స్‌తో కూడిన అభినయప్రధాన పాత్రల్లో మాత్రమే నటించాలని నిర్ణయించుకున్నా. అలాంటి క్యారెక్టర్స్ వల్లే కథానాయికగా ముందుకు సాగుతున్నా.
తదుపరి సినిమాల విశేషాలేమిటి?
‘విరాటపర్వం’ షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ చెప్పడమే బ్యాలెన్స్‌గా ఉంది. తమిళంలో ఓ సినిమా చేశా. ఈ రెండు సినిమాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తయిన తర్వాతే కొత్త చిత్రాలపై సంతకం చేయాలనుకుంటున్నా.
మీ చెల్లెలు పూజ కూడా సినిమాల్లో అడుగుపెట్టడం ఎలా అనిపిస్తోంది?
పూజ సినిమాల్లో నటిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. తనకు నటన పట్ల ఆసక్తి ఉన్నా నాతో ఆ మాట ఏ రోజూ చెప్పలేదు. ఆమె నటించిన ‘చితిరై సెవ్వానం’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాయిపల్లవి సోదరిగా కాకుండా తనకంటూ ఓ సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నది. నాకు పూర్తి భిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నది. పూజను పోటీగా ఎప్పుడూ భావించను.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
శ్యామ్ సింగరాయ్, 83 సహా.. క్రిస్మస్కు వస్తున్న సినిమాలు ఇవే..
Nani | ఆ సినిమాలకు అస్సలు భయపడను : నాని
Virataparvam Release | విరాటపర్వం థియేటర్లలోకి రాదా..కారణమేంటో..?
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Bheemla nayak postponed | భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ఎఫ్ 3 రిలీజ్ వాయిదా
Rakul | పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రకుల్!
Samantha | సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు.. సమంత షాకింగ్ పోస్ట్