సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 18 : కార్తిక శుద్ధ పౌర్ణమి లేదా కార్తిక పున్నమి అనగా కార్తిక మాసంలో శుక్ల పక్షంలో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తిక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కార్తిక పౌర్ణమి అనేది హరి, హరులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోనూ కార్తిక మాసానికి ప్రత్యేకత కలిగి ఉందని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిరోజూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావంతమైనది.
ప్రత్యేకంగా చేయాల్సిన పూజలు…
దైవ దర్శనం, దీపారాధన, దీపదానం, సలగ్రామ దానం, దీపోత్సవ నిర్వహణ ఈ రోజు విశేష శుభ ఫలితాలను అనుగ్రహిస్తాయని కార్తిక పురాణంలో పేర్కొనబడింది. ఎవరి శక్తి సామర్ధ్యాలను బట్టి హరి, హరులను సేవించి వారి కరుణ కటాక్షాలను పొందుతారు. వీరిని ఎంత నిష్టతో తరిస్తే అంత శుభ ఫలితాలు లభిస్తాయి.
ముస్తాబైన కేతకీ దేవాలయం
ఝరాసంగం, నవంబర్ 17: సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండలంలో పార్వతీ సమేత సంగమేశ్వరస్వామి ఆలయం ఉంది. స్వామి వారిని దర్శించుకునేందుకు తెలంగాణతోపాటు కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్ర నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
అమృత గుండం చుట్టూ 20 లక్షల దీపాలు..
అమృత గుండం వెనుకల మహిళలు దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. కార్తిక మాసంలో కేతకీ క్షేత్రానికి దర్శించుకునేందుకు భక్తులు సూమరుగా 10 లక్షల దీపాలు వెలిగిస్తారు.
కార్తిక పౌర్ణమిన దీపారాధన చేస్తే మోక్షం
కార్తిక పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనది. శివుడికి, విష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం. ఈ రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. శివ, విష్ణు దేవాలయాల్లో దీపాలు వెలిగించాలి. దీపాలను కుంకుమ, పూలతో అలంకరించాలి. అరటి దొన్నైల్లో దీపాలు వెలిగించి చెరువులు, నదులు, జలపాతాల్లో విడిచి పెట్టాలి.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
కార్తిక పౌర్ణమి రోజు కేతకీ ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కవగా ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. తాగునీరు, గదులు, సౌకర్యం కల్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజే స్తాం. దీపాలు వెలిగించేందుకు భక్తులకు ప్రమిదలను ఉచితంగా అందజేస్తాం.
-శ్రీనివాసమూర్తి, కేతకీ ఆలయ ఈవో
భక్తులకు ఉచితంగా దీపాలు
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని దీపారాధన, గంగహారతి, కల్యాణంలో పాల్గొనే భక్తులకు స్వామి వారి కండువ, బ్లౌజ్పీసులు దేవస్థానం తరఫున అందజేస్తాం. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజే స్తాం. దీపాలు వెలిగించడానికి ప్రమిదలు ఉచితంగా ఇస్తాం. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారి కల్యాణంలో పాల్గొనాలి.
-నీల వెంకటేశంగుప్తా, కేతకీ ఆలయ చైర్మన్