కరీంనగర్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు కూన సదానందం. ఊరు చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి. అతడికి ఉన్న 30 గజాల బావిలో నెల కిందటి వరకు నీళ్లు బాగానే ఉన్నాయి. ఇదే భరోసాతో ఈ యాసంగిలో నాలుగెకరాల్లో మక్క, రెండెకరాల్లో వరి సాగు చేశాడు. కానీ, ఒక్కసారిగా బావిలో ఊట అడుగంటింది. కొద్దిగొప్ప నీళ్లు ఇచ్చే బోరూ ఎత్తిపోయింది. అప్పటి వరకు పచ్చగా ఎదిగి ఎన్నో ఆశలను రేకెత్తించిన వరి పంట కాస్త నెర్రెలు వారడం మొదలైంది. ఇటు మక్క జొన్న కూడా వడలిపోతున్నది. ఏం చేయాలో పాలుపోని సదానందం ఎలాగైనా పంటలు కాపాడుకోవాలని నిర్ణయానికి వచ్చాడు.
ఇందుకు ఒక ట్యాంకర్ను నెలకు రూ.10 వేలు వెచ్చించి అద్దెకు తీసుకున్నాడు. తన ట్రాక్టర్తోనే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మిడ్మానేరు పరిధిలోని తోటపల్లి రిజర్వాయర్ కుడి కాలువ నుంచి నీళ్లు తెచ్చి తన గాజు బావిలో పోయించుకుంటూ, పంటలకు అందిస్తున్నాడు. ఇలా రోజుకు 10-12 ట్రిప్పుల నీళ్లు తెచ్చి మక్క, వరి పంటకు పారిస్తున్నాడు. ఇంత కష్ట పడ్డా రెండెకరాల మక్క ఎండి పోయింది. పంట విలువ తెలిసిన సదానందం ఎక్కడా వెనక్కి తగ్గ లేదు.
ఉన్న పంటనైనా కాపాడుకోవాలనే పట్టుదలతో తన ప్రయత్నాన్ని మానుకోవడం లేదు. ఇప్పుడు రెండెకరాల్లో ఉన్న మక్క, మరో రెండెకరాల్లోని వరి పంటను రక్షించుకునేందుకు రోజూ రూ.వెయ్యి డీజిల్ ఖర్చు చేస్తూ ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతను పడుతున్న కష్టా న్ని చూసి తోటి రైతులు ఆశ్చర్యపోతున్నారు. గతేడాది కూడా ఈ గ్రామంలో ఇదే పరిస్థితి ఎదురైంది. వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోగా రైతులు తీవ్రంగా నష్టపోయారు.
చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి చుట్టు పక్కల అనుబంధ గ్రామాలైన బరిగెలపల్లి, బొల్లోనిపల్లితోపాటు ఇందుర్తి గ్రామంలో కొంత భాగంలో సాగునీటి ఎద్దడి రాబోతున్న ప్రమాదకర సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ఈ గ్రామాల ఆయకట్టుకు ఇప్పటి వరకు కాలువలు తవ్వలేదు. గౌరవెల్లి నుంచి హుస్నాబాద్, మాందాపూర్, కొండాపూర్, సుందరగిరి మీదుగా గాగిరెడ్డిపల్లికి కాలువ అలైన్మెంట్ పూర్తయ్యింది. పూర్తి స్థాయిలో భూసేకరణ జరిపి కాలువలు తవ్వడమే మిగిలింది. రెండేళ్లుగా అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచనలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. పూర్తిగా మెట్ట ప్రాంతమైన ఈ గ్రామాలకు సాగు నీటి కాలువలు తవ్వితే భూగర్భ జలాలు వృద్ధి చెంది పంటలు పుష్కలంగా పండేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాలువలు తవ్వించి ఈ ప్రాంత రైతుల సాగు నీటి కష్టాలను తీర్చాల్సిన అవసరం ఉంది.