బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సును అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. బీఆర్ఎస్ నాయకులతో పాటు నిరుద్యోగులు, యువకులు సభకు రాకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేస్తున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు సరూర్‌నగర్‌లోని సభా ప్రాంగణం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిరుద్యోగులు, యువతను అడ్డుకునేందుకు నగరంలోని అన్ని మెట్రో స్టేషన్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, యూత్ డిక్లరేషన్ పేరిట బోగస్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ఎండగట్టేందుకు సరూర్‌నగర్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన యువ సంగ్రామ సదస్సును అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ ముందు నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ముందు ఈ సదస్సుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి హైకోర్టులో సవాలు చేశారు. దీంతో హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.
బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభకు వెళ్లకుండా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్ https://t.co/roxyHPPbHN pic.twitter.com/plf2dkrsgQ
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026
హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో 18న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 7గంటలలోపు సదస్సు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. సదస్సును శాంతియుతంగా నిర్వహించాలని, జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని, రహదారుల దిగ్బంధం, ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దని ఆదేశించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషాలను ప్రేరేపించే వ్యాఖ్యలు చేయరాదని, చట్టం-శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు విధించే అన్ని సహేతుకమైన షరతులను పాటించాలని న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.