మధిర, జూన్ 19 : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో మరోసారి ఎర వేస్తుందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. గురువారం బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. 18 నెలల పాలన జరిగినప్పటికీ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. గత యాసంగిలో రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా రైతు బంధు అందలేదన్నారు. అభివృద్ధి పనుల పేరుతో నిధులు ఎవరి జేబులోకి పోతున్నాయో ప్రజల గమనిస్తున్నారన్నారు.
కరోనా సమయంలో 100 పడకల ఆస్పత్రి కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిందని, దానిని నేటికీ ప్రారంభించలేదన్నారు. నాటి మంత్రి సేలం సిద్ధారెడ్డి బోడెపుడి వెంకటేశ్వరరావు పేరుమీద చేపట్టిన పథకాలను కనుమరుగు చేసే విధంగా భట్టి విక్రమార్క వ్యవహరించారన్నారు. మధిర నియోజకవర్గానికి బోడెపుడి సృజన స్రవంతి పథకం పేరుతో మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేస్తే ఆ పేరును రూపుమాపేందుకు జాలిముడి ప్రాజెక్టు ఏర్పాటు చేసి ప్రజలకు నీరు అందించిన పరిస్థితి లేదన్నారు.
కొత్తగా నిర్మించబోయే బస్టాండ్‌కు ఎన్టీఆర్ బస్టాండ్ గా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. మధిర అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై కూడా ప్రజలకు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శులు బొగ్గుల భాస్కర్ రెడ్డి, అరెగ శ్రీనివాసరావు, మాజీ రైతు బంధు కన్వీనర్ చావా వేణు, ఎన్నంశెట్టి అప్పారావు, ఉమామహేశ్వర్ రెడ్డి, కోనా నరేందర్ రెడ్డి, సత్యం బాబు, కూరేష్, లంకె మల్ల నాగేశ్వరరావు, కొత్తపల్లి నరసింహారావు, జగన్మోహన్రావు, ముత్తారు ప్యారి పాల్గొన్నారు.